ఉదయాన్నే ఇడ్లీ, దోసె, వడ, బోండా ఇలా ఏ టిఫిన్స్లోకైనా పల్లీ చట్నీ తప్పక చేస్తుంటారు. కొందరు చట్నీ ఉంటేనే టిఫిన్ తింటాను అని అంటుంటారు. అయితే, ఎప్పుడూ పల్లీలు, పుట్నాలతో చట్నీ చేయడం కామన్! అందుకే మీ కోసం ఒక కొత్త చట్నీ పరిచయం చేయబోతున్నాం. అదే “సొరకాయ చట్నీ”. ఏంటీ సొరకాయతో చట్నీ ఎలా చేస్తారు? అని ఆలోచిస్తున్నారా? ఈ స్టోరీ చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ సొరకాయ చట్నీ పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ ఇలానే ట్రై చేయమంటారు.
కావాల్సిన పదార్థాలు
- సొరకాయ – 1 (చిన్న సైజ్ది)
- పచ్చిమిర్చి – కారానికి తగినన్ని
- నూనె – టేబుల్ స్పూన్
- అల్లం – 2 ఇంచుల ముక్క
- కరివేపాకు – 2
- వెల్లుల్లి రెబ్బలు – 5
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- ఉప్పు – రుచికి సరిపడా
- జీలకర్ర – పావు టీస్పూన్
- పెరుగు – 1 కప్పు
తాలింపు కోసం :
- ఆయిల్ – 2 టేబుల్స్పూన్లు
- ఆవాలు – అరటీస్పూన్
- జీలకర్ర – అరటీస్పూన్
- ఎండుమిర్చి – 2
- కరివేపాకు – కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా సొరకాయ పై ఉండే పొట్టు పీలర్ సహాయంతో తీసుకోవాలి. ఆపై శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, సొరకాయ ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై వేయించుకోవాలి.
- సొరకాయ ముక్కల్లోని వాటర్ ఇగిరిపోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం ముక్కలు, కరివేపాకు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి.
- అల్లం పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ గిన్నెలో చల్లారిన సొరకాయ ముక్కల మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆపై అందులో కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి.
- మరొక గిన్నెలో కప్పు తాజా పెరుగు తీసుకొని తరకలు లేకుండా చిలుక్కోవాలి. అనంతరం ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న సొరకాయ చట్నీని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి తాలింపుని రెడీ చేసుకోవాలి.
- తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని చిటపటమనే వరకు వేయించుకోవాలి.
- చివరిగా తాలింపులో కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. ఆపై చట్నీలో తాలింపు వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- అంతే, ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన “సొరకాయ చట్నీ” రెడీ అయిపోతుంది!
- వేడివేడి ఇడ్లీలలోకి ఈ సొరకాయ చట్నీ టేస్ట్ ఎక్సలెంట్.
- కాస్త కొత్తగా ఉండే ఈ చట్నీ నచ్చితే మీరూ ఓసారి టిఫిన్స్లోకి ట్రై చేయండి.
































