Child Education: పిల్లల పైచదువులకు భరోసా.. ఇలా బంపర్ రిటర్న్స్.. 21 ఏళ్లు వచ్చే వరకు చేతికి రూ. 20 లక్షలు!

www.mannamweb.com


Child Insurance Plans: ద్రవ్యోల్బణం ప్రతి నెలా పెరుగుకుంటూ పోతున్న తరుణంలో పిల్లల చదువులు కూడా భారంగా మారుతున్నాయి. దీంతో ఈ ఆర్థిక సవాలును అధిగమించడానికి ఏం చేయాలనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. దీనికి మనం ఇప్పుడు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయుల ఆర్థిక ప్రణాళికల్లో పిల్లల చదువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. బడిలో చేరినప్పటి నుంచి మొదలుకొని.. ఉన్నత విద్య వరకు మొత్తం ఎంత కావాలో ముందుగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకోసం పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే.. దీర్ఘకాలిక దృష్టితో ఎక్కువ రాబడి అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే ఎలాంటి చిక్కులు లేకుండా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడంలో తల్లిదండ్రులు విజయం సాధించొచ్చు.

>> కాస్త పేరున్నటువంటి బడిలో పిల్లల్ని చేర్పించాలంటే సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర ఖర్చులు అదనం. స్కూల్‌లో చేర్చినప్పట్నుంచి.. ఉన్నత విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ఖర్చు ఎంతవుతుందన్నది అంచనా ముందే వేస్కోవాలి. దీనితో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనే విషయంపై స్పష్టత వస్తుంది.
మొత్తం ఒకేసారి అవసరం ఉండదు కాబట్టి.. దశల వారీగా ఎప్పుడు ఎంత మొత్తం కావాలన్నది తెలుసుకుంటే.. దానికి అనువైన పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలవుతుంది. పిల్లల అవసరాలకు పెట్టుబడులు పెట్టేటప్పుడు.. లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ అందించే వాటినే ఎంచుకోవాలి.

>> పిల్లల చదువుల కోసం పెద్ద మొత్తంలో కూడబెట్టేందుకు ఒక పథకంపైనే ఆధారపడితే చాలదు. సేఫ్‌గా ఉండే రికరింగ్ డిపాజిట్లు మొదలు.. ఎక్కువ నష్టభయం ఉండే షేర్ల వరకు పెట్టుబడులు పెడుతుండాలి. ఈక్విటీ ఫండ్స్‌తో సహా డెట్ పథకాల్ని ఎంచుకోవాలి. ఎక్కువ నష్టభయం ఉండే ఈక్విటీ స్కీమ్స్‌కు ఎంత కేటాయించాలి.. సురక్షిత పథకాలకు ఎంత మళ్లించాలనేది కూడా కీలకం. 10-12 సంవత్సరాల వ్యవధి ఉన్నప్పుడు.. ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్ని ఎంచుకోవాలి. నాలుగైదేళ్లలోనే డబ్బు వెనక్కి రావాలనుకుంటే డెట్ పథకాల్ని పరిశీలించాలి.

ఫండ్లలోనూ మదుపు..
పిల్లల ప్రత్యేక అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కూడా ప్రత్యేక పథకాల్ని తీసుకొస్తున్నాయి. చైల్డ్ గిఫ్ట్ ప్లాన్, చైల్డ్ కెరీర్ ప్లాన్ వంటివి ఉంటాయి. సెబీ రూల్స్ ప్రకారం వీటికి ఐదేళ్ల లాకిన్ వ్యవధి ఉంటుంది. లేకపోతే పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు పథకాలు ఉంటాయి. ఈక్విటీల్లో 65 శాతం, డెట్ ఫండ్లలో 35 శాతం వరకు మదుపు చేస్తాయి. వీటిల్లో కాస్త రిస్క్ ఉన్నప్పటికీ.. లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు.

పిల్లల పేరిట పాలసీలతో..
తల్లిదండ్రుల మొదటి ప్రాధాన్యం పిల్లల కోసం పొదుపు చేయడమే. అందుకోసమే పలు పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. పిల్లల అవసరాలకు మొత్తం డబ్బు అందుబాటులో ఉంటుందని ఏ పథకం కూడా హామీ ఇవ్వదు. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్లు, బంగారం, షేర్లు, రియల్ ఎస్టేట్ దేంట్లోనైనా మనం పెట్టుబడి పెడుతూ వెళ్తేనే దీర్ఘకాలంలో లాభాలు అందిస్తాయి.

>> ఉదాహరణకు ఏడాది వయసున్న అమ్మాయి లేదా అబ్బాయికి 21 ఏళ్లు వచ్చే వరకు చేతికి రూ. 20 లక్షలు కావాలనుకుందాం. దీని కోసం పేరెంట్స్.. 12 శాతం వార్షిక రాబడి వచ్చే పథకాల్లో సంవత్సరానికి కనీసం రూ. 25 వేల వరకు మదుపు చేయాల్సి ఉంటుంది. దీనిని కూడబెట్టేందుకు ఎలాంటి అనుకోని పరిస్థితులు కూడా అడ్డురావొద్దు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలంటే.. పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న బీమా పాలసీల్ని ఎంచుకోవాలి. పాలసీల్ని కూడా పిల్లల చదువులో భాగం చేస్తే.. ఒకవేళ కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలోనూ వారి చదువు అవాంతరం ఏర్పడదు.