AP SSC Results 2024 Revaluation Schedule: పదోతరగతి ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరుకునేవారు ఏప్రిల్ 23 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థులు ఏప్రిల్ 30న రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. గతంలో మాదిరి ఆఫ్లైన్/మాన్యవల్ అప్లికేషన్ విధానాన్ని రద్దు చేశారు.
జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు వెంటనే వారివారి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సిందిగా కోరాలి. ప్రధానోపాధ్యాయులు చివరితేదీ వరకు వేచి చూడకుండా.. సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకేసారి అందరి విద్యార్థుల దరఖాస్తుల సమర్పణ కాకుండా.. వేర్వేరు సమయాల్లో నిర్ణీత గడువులోపు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు ముగించడం ఉత్తమం.
రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ.500, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పాఠశాలలో మాత్రమే ఇందుకోసం నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులకైనా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కోరవచ్చు.
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకాలనుకుంటున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రూ.50 ఆలస్యరుసుముతో మే 1 నుంచి 23 వరకు ఫీజు చెల్లించవచ్చు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుకు HM లకు అవసమయ్యే పత్రాలు…
➥ మార్చి-2024 పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల జాబితా
➥ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేయాలనుకుంటున్న సబ్జెక్టులు/పేపర్ల జాబితా
➥ విద్యార్థి లేదా తల్లిదండ్రుల మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ వివరాలు అవసరమవుతాయి.
➥ దరఖాస్తు రుసుము ఆన్లైన్లో (డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్/UPI) చెల్లించాలి.
ఏప్రిల్ 26 నుంచి షార్ట్ మెమోలు..
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైవారికి ఇంటర్ ప్రవేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏప్రిల్ 26 నుంచి షార్ట్ మెమోలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ వివరాల ఆధారంగా విద్యార్థుల మార్కుల మెమోలు, వ్యక్తిగత షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండానే నేరుగా అధికారిక వెబ్సైట్ నుంచి ఫలితాలతోపాటు, షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల అందరి SSC సర్టిఫికేట్లను సంబంధిత పాఠశాలలకు నిర్ణీత గడువులోగా పంపుతారు. అలాగే పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణత కాలేకోపోయిన విద్యార్థుల నామినల్ రోల్స్ను ఏప్రిల్ 24 నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో మే 1 నుంచి 23 వరకు ఫీజు చెల్లించవచ్చు. త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల పూర్తిస్థాయి టైమ్టేబుల్ను అధికారులు వెల్లడించనున్నారు.