తెలుగు సినిమా రంగంలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల మధ్య విభేదాల కారణంగా మరో సంక్షోభానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు ముఖం చాటేస్తున్న తరుణంలో పంపిణీ వ్యవస్థలో అధిపత్య పోరాటం కారణంగా థియేటర్లు మూతపడే పరిస్థితులు తలెత్తడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నది.
అయితే డిస్టిబ్యూషన్ రంగంలో ఇప్పటి వరకుకొనసాగతున్న విధానానికి భిన్నంగా కొత్త పద్దతిలో తమకు అద్దెను చెల్లించాలని థియేటర్ల యాజమాన్యం, లీజ్ యాజమాన్యం డిమాండ్ చేయడం వివాదానికి దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వివాదం వెనుక అసలు కారణం ఏమిటనే విషయంపై డిస్ట్రిబ్యూషన్ రంగానికి చెందిన ఓ ప్రముఖుడు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
పర్సంటేజ్ విధానంలో
తెలుగు సినిమా పరిశ్రమలో సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ అనే రెండు వ్యవస్థలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల కోసం వసూలయ్యే కలెక్షన్లలో పర్సంటేజ్ ప్రకారం అద్దె చెల్లించే ఆనవాయితీ వస్తున్నది. ఈ పర్సంటేజ్ తొలివారం ఓ రకంగా అంటే 60 – 40 రేషియోలో, రెండు, మూడు వారాలకు ఓ రకంగా ఉంటుంది. అయితే అదే పద్దతిని కూడా సింగిల్ థియేటర్లకు వర్తింప చేయాలనే డిమాండ్‌ను డిస్టిబ్యూటర్లు తెరపైకి తెచ్చి నిర్మాతలపై ఒత్తిడి పెంచారు.
నైజాంలో ఏషియన్.. ఆంధ్రాలో దిల్ రాజు
నైజాంలో ఏషియన్, సురేష్ వాళ్లకు ఎక్కువ గ్రౌండ్ లీజ్‌లో థియేటర్లు ఉన్నారు. ఆంధ్రాలోని వైజాగ్ ప్రాంతంలో దిల్ రాజుకు ఎక్కువ స్క్రీన్లు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ డిస్టిబ్యూషన్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఎక్కువ థియేటర్లు లీజ్‌కు తీసుకొన్నారు. దాంతో దిల్ రాజుకు, మైత్రీకి మధ్య కొంత బిజినెస్ పరంగా డిస్ట్రబ్ అయింది.
డిస్ట్రిబ్యూషన్ రంగంలో అధిపత్య పోరు
అయితే ఇటీవల కాలంలో ప్రేక్షకులు రాక సింగిల్ థియేటర్లు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో వాటికి పర్సంటేజ్ విధానంలో అద్దె చెల్లించాలని డిమాండ్ వెనుక అసలు కారణం డిస్ట్రిబ్యూషన్ రంగంలో మైత్రీ మూవీస్, దిల్ రాజు, ఏషియన్ సురేష్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటమే కారణమనే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ ఆధిపత్య పోరాటంలో భాగంగానే థియేటర్లు మూతపడే పరిస్థితికి దారి తీసింది అనే వాదన వినిపిస్తున్నది.
మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి
ఇటీవల కాలంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మైత్రీ మూవీ మేకర్స్ ప్రవేశించడంతో దిల్ రాజు, ఏషియన్ సునీల్‌కు చెందిన బిజినెస్ కొంత వెనుకపడింది. ఆ కారణంగానే నైజాం, ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో దిల్ రాజు, సునీల్, డి సురేష్ వర్గాలకు ఉన్న పట్టును చూపించుకోవడానికి నిర్మాతల ముందు పర్సంటేజ్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. ఈ విషయంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి అని ఓ డిస్టిబ్యూటర్ వెల్లడించారు.
సింగిల్ థియేటర్స్ రెంట్ సిస్టమ్
మల్టీప్లెక్స్‌లో 60-40 పర్సెంటేజ్‌తో అద్దె లేదా కమిషన్ చెల్లిస్తున్నారు. ఓ షోకు వసూలైన మొత్తంలో జీఎస్టీ మినహాయించిన తర్వాత వచ్చే మొత్తం నుంచి థియేటర్ యజమాన్యం, డిస్టిబ్యూటర్లు పర్సంటేజ్ ప్రకారం పంచుకొంటారు. కానీ సింగిల్ థియేటర్ల విషయానికి వస్తే.. ముందుగా జరిగిన ఒప్పంద ప్రకారం.. థియేటర్‌ను బట్టి 13 వేల నుంచి 20 వేల వరకు అద్దె లేదా కమిషన్ చెల్లిస్తారు. కానీ ఆ మొత్తం థియేటర్ల మెయింటెనెన్స్‌కు కూడా సరిపోవడం లేదు. చిన్న సినిమాలు అసలు ఆడటమే లేదు. ఈ పరిస్థితుల్లో సంవత్సరానికి ఒకటో రెండో పెద్ద హీరోల సినిమాలు వస్తే.. ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. వాటిలో పర్సంటేజ్ ప్రకారం అద్దె లేదా కమిషన్ వస్తే.. సంవత్సరంలో కొన్ని నెలలు సాఫీగా గడిచిపోతుంది అని డిస్టిబ్యూటర్ వెల్లడించారు.
చిన్న సినిమాలు.. పెద్ద హీరోలు మూవీస్
సంక్రాంతి సీజన్ వరకు సింగిల్ థియేటర్లలో బిజినెస్ బాగానే ఉంది. కానీ సంక్రాతికి వస్తున్నాం సినిమా ఒక్కటే భారీగా లాభాలను పంచింది. ఓ ఏరియాలో 30 లక్షలు పెట్టి కొంటే.. అదనంగా 30 లక్షలు లాభం వచ్చింది.హిట్ 3 సినిమా కొన్ని చోట్ల లాభం, మరికొన్ని చోట్ల స్వల్ప నష్టాలు వచ్చాయి. జనవరి తర్వాత సినిమాలు పెద్దగా వసూళ్లను రాబట్టిన దాఖలాలే లేవు అని డిస్టిబ్యూటర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
థియేటర్ యాజమాన్యానికి లాభం ఉంటుందా?
పర్సంటేజ్ విధానంతో థియేటర్ ఓనర్లకు ఎలాంటి లాభం ఉండదు. గ్రౌండ్ లీజ్ ఉన్న డిస్టిబ్యూటర్లకే లాభం ఉంటుంది. ఇందులో కొందరు థియేటర్ ఓనర్లు కూడా లబ్ది పొందుతారు. ఒకసారి లీజ్ తీసుకొన్న తర్వాత థియేటర్ ఓనర్లకు పర్సంటేజ్ విధానంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఏషియన్, దిల్ రాజు లాంటి డిస్టిబ్యూటర్లకే లబ్ది చేకూరుతుంది. ప్రస్తుతం ఈ విధానంపై నిర్మాతలు ఎలా స్పందిస్తారనే విషయంపైనే వివాదానికి ముగింపు ఉంటుంది అని డిస్టిబ్యూటర్ పేర్కొన్నారు.
ఎవరు సానుకూలం? ఎవరు వ్యతిరేకం?
తాజా వివాదం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న నేపథ్యంలో పర్సంటేజ్ విధానానికి దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ బాబు సానుకూలంగా ఉన్నారు. ఈ వ్యవహారంలో మైత్రీ మూవీ మేకర్స్ వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ వివాదానికి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దూరంగా ఉండటం అందర్నీ ఆసక్తికి గురి చేస్తున్నది. యూవీ, సితార సంస్థలు, ఇతర నిర్మాతలు స్పందించే తీరు బట్టే ఈ వివాదానికి తెర పడే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ సినిమాకు ఎఫెక్ట్
తెలుగు సినిమా రంగంలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ఫిలిం ఛాంబర్ నేతృత్వంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు మే 21వ తేదీన రిలీజ్ కానున్నారు. ఆ సమావేశంలో చర్చలు విఫలమైతే.. జూన్ 1వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణలో సింగిల్ థియేటర్లు మూసి వేయాలనే నిర్ణయాన్ని తీసుకోనున్నారు. నిర్మాతలపై దిల్ రాజు, సునీల్ నారంగ్, డీ సురేష్ వాళ్లు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారనే విషయం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఒకవేళ జూన్ 1వ తేదీ నుంచి సింగిల్ థియేటర్లు మూత పడితే.. జూన్ మాసంలో హరిహర వీరమల్లు, కన్నప్ప, కుబేరా లాంటి సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. అదే జరిగితే భారీ సంక్షోభానికి తెలుగు సినిమా పరిశ్రమ గురి అవుతుందనే వాదన బలంగా వినిపిస్తున్నది.