ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది అధికార వైసీపీ. మొన్నటి వరకూ నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా ఐదవ జాబితా విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లోక్ సభ, అసెంబ్లీ ఇంఛార్జిల మార్పు జాబితాను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మారుస్తూ వారి పేర్లను, నియోజకవర్గాలను ప్రకటించింది.
అరకు వ్యాలీ అసెంబ్లీ అభ్యర్థిని మార్చేశారు. గొట్టేటి మాధవి స్థానంలో రేగా మత్స్య లింగంను నియమించారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తికి గతంలో సత్యవేడు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించిన అధిష్టానం తిరిగి తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగానే ప్రకటించింది. గురుమూర్తికి బదులు సత్యవేడు అసెంబ్లీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ ను నియమించింది. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేరును ప్రకటించి.. అవనిగడ్డ అసెంబ్లీ బరిలో సింహాద్రి చంద్రశేఖరరావును నిలబెట్టబోతోంది.
కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ పేరును ఖరారు చేసింది. ఈయన 2014లో వైయస్సార్‌సీపీ నుంచి పోటీచేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఫైర్ బ్రాండ్, జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ కు ప్రమోషన్ ఇచ్చింది అధిష్టానం. నెల్లూరు నుంచి కాకుండా నర్సారావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు రంగం సిద్దం చేసింది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో జాబితాలో 8 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ.