రాబోయే 3 రోజులు భారీ వర్షాలు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాలకు చల్లటి కబురు.

ఎండాకాలం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలు దాటిందంటే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం 4 గంటల వరకు ఎండలు దంచికొడుతున్నాయి. మార్చిలోనే భారీగా ఎండలు ఉంటే..


ఏప్రిల్, మే నెలలో ఇంకెలా ఉంటాయోనని ప్రజలు భయపడిపోతున్నారు. అయితే ఎండాకాలం ముందు వాతావరణ శాఖ తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాలకు చల్లటి కబురు చెప్పింది. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పడుతాయని సూచించింది.

2025 మార్చి 10, 12 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుందని తమిళనాడులోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) అంచనా వేసింది. మార్చి 10న తమిళనాడు తీరప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుండి మితమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మార్చి 11న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో చాలా ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. మార్చి 12 నాటికి దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రదేశాలలో వర్షాలు కురుస్తాయని.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని (RMC) అంచనా వేసింది.

రేపు (మార్చి 11) తెల్లవారుజామున దక్షిణ తమిళనాడులో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ‘X’ లో తెలిపింది. ప్రభావిత జిల్లాల్లో కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాసి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం ఉన్నాయి. మార్చి 11-13 మధ్య కేరళ & మహే.. కోస్తా మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.