ముంబయి: ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా’ అంటూ నాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) సోదరుడు అన్మోల్ పోస్ట్ పెట్టాడు. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ వార్నింగ్ నిజమేననిపిస్తోంది. గత కొంతకాలంగా సల్మాన్‌ను టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్.. పక్కా ప్లాన్‌తో నటుడి హత్యకు కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం పాక్ నుంచి ఆయుధాలను తెప్పించింది కూడా..! మరోవైపు, అతడి కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు 15-20 మంది నిత్యం రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఏకే-47 తుపాకులతో..
బాంద్రాలో నటుడి ఇంటి వద్ద కాల్పుల కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులకు.. మరో హత్య కుట్ర గురించి తెలిసింది. సల్మాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఇందుకోసం ఈ గ్యాంగ్ పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఓ ఆయుధాల సప్లయిర్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. ఏకే-47, ఎం-16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు తెలుస్తోంది. వీటితో సల్మాన్ ఖాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా.. పన్వేల్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించాలని నిందితులు పథకం రచించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఫామ్‌హౌస్ చుట్టుపక్కల పక్కా నిఘా..
ఈ కుట్రకు సంబంధించి తాజాగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను నవీ ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్మోల్, మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పన్వేల్‌లోని నటుడి ఫామ్‌హౌస్ (Salman Farmhouse) పరిసర ప్రాంతాల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 15-20 మంది నివసిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. వీరంతా ఈ ప్రాంతంలో నిరంతరం రెక్కీ చేస్తూ సల్మాన్ కదలికలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు సమాచారం. వీరి కోసం పోలీసులు ఇప్పుడు జల్లెడ పడుతున్నారు.
నాడే ఫామ్‌హౌస్‌లోకి వెళ్లేందుకు కుట్ర..
ఈ ఏడాది జనవరిలోనూ నటుడి (Bollywood Actor Salman Khan)పై దాడికి బిష్ణోయ్ గ్యాంగ్ విఫలయత్నం చేసింది. పన్వేల్‌లో ఆయనకు చెందిన అర్పితా ఫామ్‌హౌస్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. నటుడి అభిమానులమని చెబుతూ అజేష్ కుమార్ ఓం ప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్‌సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ చెకింగ్‌లో నకిలీ ఐడీలు చూపించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ నటుడిని టార్గెట్ చేసింది. ఇటీవలి కాలంలో తమ ప్రణాళికలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. కెనడా కేంద్రంగా ఈ కుట్రలు జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.