బిచ్చగాడు అనే సినిమా తక్కువ బడ్జెట్‌తో వచ్చి బిగ్ హిట్ అందుకుంది.. అయితే, తన తల్లి ఆరోగ్యం బాగుపడాలని, ఆమె ప్రాణాలు నిలవాలని..
ఓ కొడుకు బిచ్చగాడిగా మారిపోతారు.. తల్లి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి వస్తాడు.. ఇక, బిచ్చగాళ్లకు కొదవలేదు.. గుడి దగ్గర వీరి సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతుందనే చెప్పాలి.. మరోవైపు, ప్రధాన కూడళ్లలో.. సిగ్నల్ పడగానే వివిధ రకాల బిచ్చగాళ్లు వచ్చి వాహనదారులను యాచిస్తుంటారు.. వీరిలో కొందరు నిజంగానే కొందరు శారీరక, మానసిక వ్యాధులతో బాధపడేవారు ఉంటే.. మరికొందరు మాత్రం.. యాక్షన్ చేస్తూ కూడా డబ్బులు, వస్తువులు అడుగుతుంటారు.. ఇక, హోటళ్ల దగ్గర కూడా అడుక్కునేవారు లేకపోలేదు.. అయితే, ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. వాళ్లు బిచ్చగాళ్లు మాత్రమే కాదు.. బిచ్చగాళ్ల ముసుగులో క్రిమినల్స్ కూడా ఉండొచ్చు.. నేరాళు చేసి.. తప్పించుకుని తిరుగుతూ.. బిచ్చగాడి అవతారం ఎత్తి ఉండొచ్చు..
ఇప్పుడు నంద్యాల జిల్లాలో జరిగిన బిచ్చగాడు దస్తగిరి హత్య.. ఎంతో మంద్రి క్రిమినల్స్ బిచ్చగాళ్ల రూపంలో తిరుగుతున్నారనే సంచలన విషయాన్ని బయటపెట్టింది.. బిచ్చగాళ్ల ముసుగులో కొందరు క్రిమినల్స్ తిరుగుతున్నారు.. వీరికి షెల్టర్ జోన్లుగా రైల్వే స్టేషన్, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు మారిపోయాయి.. బిచ్చగాడు దస్తగిరి హత్య తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. బిచ్చగాళ్లను విచారించారు.. బిచ్చగాళ్ల ఫింగర్ ప్రింట్స్ సేకరించి, టెక్నికల్ సిబ్బందికి పంపించారు.. దీంతో, షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.. 120 మంది బిచ్చగాళ్లలో 30 మందికి నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులకు నివేదిక అందింది.. డేటా సేకరించి పోలీసులు.. వారిని మందలించి పంపినట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఆయా ప్రాంతాల్లో పోలీస్ పికెట్, సీసీ కెమెరాలు, ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు పోలీసులు..
కాగా, మద్యం మత్తులో వంద రూపాయల నోటు ఇవ్వలేదని బిచ్చగాడుని బండరాయితో మోది, దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.. నంద్యాలలోని నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువ జరిగిన దస్తగిరి అనే బిచ్చగాడి హత్య కేసు మిస్టరీగా మారగా.. ఆ మిస్టరీని ఛేదించారు త్రీ టౌన్ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవుకు మండలం కొండమాయ పల్లెకు చెందిన దస్తగిరికి ఇద్దరు భార్యలు, నలుగురు కుమారులు వున్నారు. వీరితో గొడవ పడి, నంద్యాలకు వచ్చి, రైల్వే స్టేషన్, నూనెపల్లె, నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు దస్తగిరి.. అయితే, సిరివేళ్లకు చెందిన రహ్యుం జులాయిగా పని పాట లేకుండా తాగి తిరిగేవాడు. ఈ క్రమంలో నంద్యాలకు వెళ్లి సాయిబాబా నగర్ సెంటర్ లోని వైన్స్ లో తప్పతాగి, అక్కడే పడిపోయాడు. ఇక, రెండు గంటల తర్వాత లేచి, నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాంతానికి వెళ్లాడు.. అర్ధరాత్రి దగ్గర్లోనే నిద్రపోతున్న దస్తగిరిని లేపి, తాగడానికి డబ్బు ఇవ్వమని బెదిరించాడు రహ్యుం. కానీ, దస్తగిరి ఇవ్వకపోవడంతో జేబులో ఉన్న వంద రూపాయల నోటును లాక్కోబోయాడు. దీంతో, ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది.. ఆవేశంతో ఊగిపోయిన రహ్యుం.. బండరాయితో దస్తగిరి తలపై మోది వెళ్లిపోయాడు.. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పుడు నంద్యాల పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు.