క్రిస్పీ “ఆలూ మిక్చర్​” – ఈ పద్ధతిలో చేస్తే నూనె కూడా తక్కువగానే పీల్చుకుంటుంది

ఇంట్లో సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతుంటారు. ఆ సమయంలో చాలా మంది వివిధ రకాల తినుబండరాలు చేస్తుంటారు. కానీ కొన్నింటికి టైమ్ ఎక్కువగా పడుతుంది. అందుకే ఇవాళ ఇన్​స్టంట్​గా చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని మీకోసం తీసుకొచ్చాం. అదే ఆలూ మిక్చర్. ఇది నోటికి క్రిస్పీగా, కారంగా ఉండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాదు ఈ స్నాక్​ని చాలా తక్కువ పదార్థాలతో నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే సూపర్​గా వస్తుంది. అంతేకాక ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది! పిల్లలైతే దీన్ని చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి నోరూరించే ఈ ఆలూ మిక్చర్​ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు – 4
  • ఉప్పు – రుచికి సరిపడా
  • నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
  • పల్లీలు – అర కప్పు
  • జీడిపప్పు – 15
  • పుట్నాలు – అర కప్పు
  • కరివేపాకు – కొద్దిగా
  • కారం – అర టీ స్పూన్
  • చాట్ మసాలా – అర టీ స్పూన్
  • తయారీ విధానం :

    • ముందుగా నాలుగు బంగాళదుంపలను కడిగి పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు గ్రేటర్​తో సన్నగా తురుమి గిన్నెలో వేయాలి.
    • ఆ తర్వాత బంగాళదుంప తురుమును రెండు సార్లు కడగాలి. అనంతరం సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి స్టవ్​పై పెట్టి ఉడికించాలి. మరి మెత్తగా కాకుండా చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
    • ఇంకోవైపు గిన్నెలో చల్లటి నీళ్లు పోయాలి. ఇందులో ఉడికించిన ఆలూ తురుమును వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
    • అనంతరం ఓ క్లాత్​పై ఆలూ తురుము వేసి 10 నిమిషాల పాటు ఆరబెట్టాలి.
    • మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్​ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఆలూ తురుమును వేసి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి క్రిస్పీగా వేయించాలి. అనంతరం వీటిని ప్లేట్​లో తీసుకోవాలి.
    • ఇదే నూనెలో అర కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసి ప్లేట్​లో వేయాలి.
    • అలాగే 15 జీడిపప్పు పలుకులు, అర కప్పు పుట్నాలు యాడ్ చేసి దోరగా వేయించి ప్లేట్​లో వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసి వేయించి ప్లేట్​లో వేసుకోవాలి.
    • ఇప్పుడు గిన్నెలో వేయించిన ఆలూ తురుము, పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు, కరివేపాకు మిశ్రమం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
    • మరో కప్పులో మూడు చిటికెడ్ల ఉప్పు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ చాట్ మసాలా వేసి కలపాలి.
    • ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఆలూ మిక్చర్​లో ఉప్పుకారంచాట్​మసాలా మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
    • ఇక అంతే కరకరలాడే ఆలూ మిక్చర్ తయారైనట్లే!
    • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలూ ఎంతో ఇష్టంగా తింటారు!
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.