దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం లోగో కలర్ మారుస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. మొన్నటిదాకా ఎరుపు రంగులో ఉన్న డీడీ లోగోను.. తాజాగా కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయం తీసుకుంది.
అయితే లోగో మార్పుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, డీడీ న్యూస్ మాజీ సీఈవో జవహర్ సిర్కార్ తప్పుపట్టారు. ఇది అనుచితమైన చర్యగా అభివర్ణించారు. స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌ను కాషాయ రంగులోకి కలర్ మార్చడం సరి కాదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాషాయ రంగులోకి డీడీ లోగోను మార్చడం బాధ కలిగిస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలో కలర్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని నిలదీశారు. ఇది ప్రసార భారతి కాదని.. ఇది ప్రచార భారతి అని జవహర్ సిర్కార్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఎన్నికల సమయంలో లోగో కలర్ మార్చడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుత సీఈవో తీరును ఆయన తప్పుపట్టారు. సిర్కార్ 2012 నుంచి 2016 వరకు దూరదర్శన్.. ఆల్ ఇండియా రేడియోకు సీఈవోగా పని చేశారు.
డీడీ న్యూస్ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తుంది. మొన్నటిదాకా ఎరుపు రంగులో ఉండే డీడీ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనలో తెలియజేసింది. మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. సరికొత్త DD వార్తలను మీ ముందుకు తెస్తున్నామని పేర్కొంది. మాకు ధైర్యం ఉంది… వేగంపై కచ్చితత్వం, ఆరోపణలపై వాస్తవాలు, సంచలన నిజాలు ప్రజల ముందుకు తెస్తామని డీడీ న్యూస్ ఓ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ మేరకు కొత్త రూపాన్ని సోషల్ వీడియో ద్వారా చూపించింది.