ప్రియుడికి విషమిచ్చి చంపిన గ్రీష్మకు మరణశిక్ష.. కోర్టు సంచలన తీర్పు

2022లో సంచలనం సృష్టించిన 23 ఏళ్ల రేడియాలజీ విద్యార్థి షారన్ రాజ్ హత్య కేసులో కేరళలోని నెయ్యత్తింకర అదనపు సెషన్స్ కోర్టు ఇవాళ (సోమవారం) కీలక తీర్పును వెలువరించింది.


ఈ కేసులో దోషిగా తేలిన షారన్ రాజ్ ప్రియురాలు గ్రీష్మకు న్యాయస్థానం మరణశిక్షను విధించింది. 2022 అక్టోబర్ 14న షారన్ తన స్నేహితుడు రెజిన్‌తో కలిసి కన్యాకుమారిలోని రామవర్మంచిరైలో ఉన్న గ్రీష్మ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో గ్రీష్మ పురుగుమందు కలిపిన ఆయుర్వేద కషాయాన్ని అతడికి ఇచ్చింది. దాన్ని షారన్ తాగి వాంతులతో ఒక ఆస్పత్రిలో చేరాడు. వైద్యపరీక్షలు చేయించుకోగా.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి కారణమయ్యే యాసిడ్‌ని అతడికి ఇచ్చారని తేలింది. రోజుల తరబడి డయాలసిస్, ఇతర చికిత్సలు చేసిన తర్వాత అదే ఏడాది అక్టోబర్ 25న షారోన్ గుండెపోటుతో చనిపోయాడు. ఈవివరాలు విచారణలో నిర్ధారణ కావడంతో గ్రీష్మకు న్యాయస్థానం మరణశిక్షను విధించింది. ఈ కేసులోని మరో దోషి గ్రీష్మ మామ నిర్మలా కుమారన్ నాయర్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది.

గ్రీష్మ చేసింది నమ్మకద్రోహం

ఈసందర్భంగా నెయ్యత్తింకర అదనపు సెషన్స్ కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ”బాయ్ ఫ్రెండ్ షారన్‌కు గ్రీష్మ నమ్మక ద్రోహం చేసింది. కుట్రపూరితంగానే అతడికి ఇచ్చిన కషాయంలో హానికారక పదార్థాలు కలిపింది. అయినా తన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు యత్నించింది. గ్రీష్మకు షారన్ ఎన్నడు కూడా తప్పుడు మెసేజ్‌లు పంపలేదు. ఆమెపై నిందలు మోపలేదు. షారన్ రెచ్చగొట్టకపోయినా, ఘర్షణకు దిగకపోయినా అతడి ప్రాణాలు తీసేందుకు గ్రీష్మ బరితెగించడం నేరమే” అని న్యాయస్థానం పేర్కొంది. ”జ్యూస్ తాగాక షారన్‌కు వాంతులు అయ్యాయి. దీంతో ఆ జ్యూస్‌ను వీడియో రికార్డ్ చేస్తానని షారన్ చెప్పాడు. ఈక్రమంలో దాన్ని రికార్డ్ చేయొద్దని గ్రీష్మ వారించింది. ఏదో అనుమానాస్పదంగా జరిగింది అనేందుకు ఆమె మాటలే పెద్ద సాక్ష్యం. 11 రోజుల పాటు కనీసం చుక్క నీరు కూడా తాగలేని స్థితిలో ప్రాణాలతో పోరాడి షారన్ కన్నుమూశాడు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

అసలు ఏం జరిగింది అంటే..

గతంలోకి వెళితే.. షారన్, గ్రీష్మ చాలా ఏళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తదుపరిగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో షారన్‌తో తన సంబంధాన్ని ముగించాలని గ్రీష్మ నిర్ణయించుకుంది. అయితేే బ్రేకప్‌కు షారన్ నిరాకరించాడు. దీంతో ప్రణాళిక ప్రకారం కషాయంలో విషం కలిపి తాగించి అతడిని హత్య చేసింది. ఫోరెన్సిక్ పరీక్షల్లోనూ ఈవిషయం తేలింది. ఈ కేసు విషయంలో 2023 జనవరి 25న పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2024 అక్టోబరు 15న కోర్టులో మొదలైన విచారణ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 3న ముగిసింది. ఎట్టకేలకు ఇవాళ తీర్పును వెలువరించారు.