Deep Fake: డీప్ ఫేక్ దారుణం..వీడియోకాల్‌లో కనిపిస్తున్నది బాస్ అనుకుని రూ.207 కోట్ల బదిలీ!

www.mannamweb.com


సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు సృష్టించిన కలకలం ఇంకా సద్దుమణగముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. డీప్ ఫేక్‌ టెక్నాలజీతో నిందితులు తాజాగా ఓ ఉద్యోగికి ఏకంగా రూ.207 కోట్ల మేర టోపీ పెట్టారు.
హాంకాంగ్‌లోని (Hongkong) ఓ ప్రముఖ కంపెనీలో వెలుగు చూసిన ఈ ఘటన(Deep Fake Fraud) ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

హాంగ్‌కాంగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్ (Chief Financial Officer) నుంచి ఈమెయిల్ వచ్చింది. ఓ సీక్రెట్ పనికోసం 25.2 మిలియన్ డాలర్లు ట్రాన్స్‌ఫర్ చేయాలనేది దాని సారాంశం. సీక్రెట్ కార్యకలాపాలు అన్న పదాన్ని చూసిన వెంటనే అతడికి సందేహం కలిగింది. కానీ అప్పటికే నిందితులు పక్కా ప్లాన్ వేసుకుని బాధితుడికి వీడియో కాల్ (Video Call) చేశారు. నిందితులు డీప్ ఫేక్ టెక్నాలజీ వాడటంతో వీడియో కాల్‌లో వారి ముఖాలన్నీ సంస్థ ఉన్నతోద్యోగుల్లానే కనిపించాయి. దీంతో, బాధితుడు తాను సంస్థ సీఎఫ్ఓ, ఇతర సహోద్యోగులతో మాట్లాడుతున్నానని భ్రమించాడు. చివరకు నిందితులు కోరిన మొత్తాన్ని బదిలీ చేశాడు. ఆ తరువాత అతడు హెడ్ ఆఫీసును సంప్రదించడంతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాధితుడు ఎవరు? అతడు ఏ కంపెనీలో చేస్తాడు? అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

డీఫ్ ఫేక్ మోసాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గగ్గోలు రేగుతోంది. ఈ టెక్నాలజీతో అసాధారణ నేరాలకు ఆస్కారం ఉండటంతో పోలీసులకు దీన్ని ఎలా కట్టడి చేయాలో తెలియట్లేదు. హాంకాంగ్‌లో ఇటీవల కాలంలో పలు డీఫ్ ఫేక్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఓ కేసులో నిందితులు తాము దొంగిలించిన ఐడీ కార్డులతో పలు బ్యాంకు లోన్లకు అప్లై చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఫేస్‌రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌నే బురిడీ కొట్టించి నేరాలకు పాల్పడ్డారు.