డిగ్రీనా? ఇంజనీరింగా?

డిగ్రీలో సీటు వచ్చింది.. ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు కూడా వెళ్తున్నా.. కానీ కోరుకున్న చోట, ఇష్టమైన బ్రాంచ్‌లో సీటు వస్తుందో రాదో! ఇటు డిగ్రీలో సీటు కన్‌ఫాం చేసుకోవటమా? వదిలేయటమా? లా కోర్సు వైపు వెళ్లటమా? డిగ్రీలోనే కొనసాగటమా?.. ఇదీ ఇప్పుడు ఇంటర్‌ పూర్తయిన విద్యార్థుల పరిస్థితి. వివిధ కోర్సుల కౌన్సెలింగ్‌ల మధ్య ఎడం భారీగా ఉంటుండటంతో విద్యార్థులు ఎటూ తేల్చుకోలేని గందరగోళ స్థితిలో పడిపోతున్నారు. రాష్ట్రంలో ఏటా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పూర్తి చేస్తున్నారు.


వీళ్లలో 1.06 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. దోస్త్‌ ద్వారా డిగ్రీ కోర్సుల్లో 2.20 లక్షల మంది చేరుతున్నారు. ఇంకో 50 వేల మంది ఇతర కోర్సుల్లోకి వెళ్తున్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాలకూ వెళ్తున్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణులంతా ఏ కోర్సులో చేరాలన్నా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాయాలి. ఆయా సెట్స్‌ నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనడం అనివార్యం. జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరేవాళ్లను పక్కన బెడితే రాష్ట్రంలోని ప్రతి కోర్సులోనూ పోటీ తీవ్రంగానే ఉంది. దీంతోపాటు వివిధ కోర్సుల కౌన్సెలింగ్‌లో సమతుల్యత పాటించకపోవడం సమస్యగా మారుతోంది.

అందనంత దూరం..
ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ గత నెల 28 నుంచి మొదలైంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్‌ అప్షన్లు ఇవ్వాలి. తొలి దశ సీట్ల కేటాయింపు 10వ తేదీన ఉంటుంది. అన్ని దశల కౌన్సెలింగ్‌ పూర్తవ్వడానికి సెప్టెంబర్‌ 19 వరకు గడువు ఉంది. డిగ్రీ కోర్సుల్లో నిర్వహించే దోస్త్‌ కౌన్సెలింగ్‌ ఇంకో పది రోజుల్లో ముగుస్తుంది. మరోవైపు జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ కూడా పూర్తి కావచి్చంది. డిగ్రీ కోర్సుల్లో దరఖాస్తు చేసిన విద్యార్థి సీటు వస్తే చేరాలా? వద్దా అన్న మీమాంసలో ఉన్నాడు. ఎందుకంటే ఇంజనీరింగ్‌ సీటుపైనా విద్యార్థి ఆశ పెట్టుకుంటాడు. అయితే, ఇంజనీరింగ్‌లో తాను కోరుకున్న బ్రాంచీలో సీటు వస్తుందా రాదా? అన్న సందేహం ఉంటుంది.

ఇంజనీరింగ్‌లో సీటు వస్తే డిగ్రీ సీటు వదులుకోవాల్సి ఉంటుంది. కానీ, అప్పటికే డిగ్రీ కాలేజీలో రిపోర్టు చేసి, సర్టీఫికేట్లు కూడా ఇచ్చేసి ఉంటారు. ఇంజనీరింగ్‌లో సీటు వస్తే అప్పటికప్పుడు సర్టీఫికేట్లు తీసుకోవడం కష్టం. ఫీజు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉండదు. పోనీ ముందుగానే డిగ్రీ సీటు వదులుకుంటే, ఆ తర్వాత ఇంజనీరింగ్‌లో సీటు రాకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతాడు. లాసెట్‌ కౌన్సెలింగ్‌ సెపె్టంబర్‌ తర్వాతే మొదలవుతుంది. అప్పటివరకు విద్యార్థి ఎందులోనూ చేరకుండా ఉంటేనే లా కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా అన్ని కోర్సుల కౌన్సెలింగ్‌లు వెంట వెంటనే జరిగితే విద్యార్థులకు ఈ సమస్య ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా జోసా, రాష్ట్ర ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు దగ్గరగా ఉండాలని చెబుతున్నారు.

దోస్త్‌ ఆఖరి అవకాశం కలి్పస్తాం
ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఆఖరి దశలో దోస్త్‌ మరోసారి నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాం. దీనివల్ల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించడమే కాకుండా, ఇంజనీరింగ్‌ సీటు రానివారికి డిగ్రీలో అవకాశం లభిస్తుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. – ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

శాశ్వత పరిష్కారం అవసరం
కౌన్సెలింగ్‌లన్నీ ఒకేసారి నిర్వహించకపోవడం వల్ల వచ్చే సమస్యను ఉన్నత విద్యా మండలి సీరియస్‌గా తీసుకోవాలి. ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకులు వచి్చన విద్యార్థులు కూడా మొదట డిగ్రీలో చేరుతున్నారు. ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తర్వాత వారు ఉంటారో లేదో తెలియదు. అప్పుడు ఆ సీట్లను ఎవరికో ఒకరికి ఇవ్వాలి. దీనివల్ల నాణ్యత దెబ్బతింటోంది. – వేదుల శాంతి, కేశవ్‌ మెమోరియల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.