ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా కానుకను యథావిధిగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం మారినందున విద్యాకానుకను ఏంచేస్తారనే సందిగ్ధత నెలకొన్నందున ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. 13న బడులు తెరుచుకునే రోజు నుంచే పంపిణీ మొదలుపెట్టనుంది. 2024-25 విద్యా సంవత్సరంలో పంపిణీకి ఇప్పటికే కిట్లను సిద్ధంచేసింది. అయితే ఓవైపు పంపిణీతో పాటు మరోవైపు విద్యాకానుకపై విచారణను కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఐదేళ్లలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగాయి.
నాణ్యతలేని బ్యాగులు, బూట్లు కొనుగోలు చేసిన విషయం గతంలోనే బయటపడింది. కావాల్సిన కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా టెండర్ల విధానం మార్చేసింది. న్యాయ సమీక్షను తప్పించుకునేందుకు టెండర్ల ప్యాకేజీలుగా విడగొట్టి ఒక్కటీ రూ.వంద కోట్లు దాటకుండా చేసింది. చివరికి ఈ విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యా కానుక కిట్లకు ఏకంగా టెండర్లను ఎత్తివేసింది. నేరుగా కాంట్రాక్టర్లకు రూ.630 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టింది. టెండర్లు అక్కర్లేదని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీచేయగా, దానిని సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అమలుచేశారు. కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి తక్కువకు ఇస్తామన్న వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించగా, సరిగ్గా అంతకముందున్న 19 మంది కాంట్రాక్టర్లనే సమగ్రశిక్ష ఎంపిక చేసింది. మరి వారే ఎలా ఎంపికయ్యారనేది అధికారులకే తెలియాలి. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది