Financial Tasks: మార్చి 31 లోపు ఇవి చేయండి

పన్ను రిటర్నులు..
గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2023-24కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు ఇంకా దాఖలు చేయని వారు.. మార్చి 31లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. రూ.5లక్షల కన్నా ఆదాయం తక్కువగా ఉన్న వారికి రూ.1,000, అంతకు మించి ఉన్న వారికి రూ.5,000 వరకూ అపరాధ రుసుము వర్తిస్తుంది. గుర్తుంచుకోండి.. కొత్త పన్ను విధానంలోనే రిటర్నులు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి, పన్ను చెల్లించాల్సి వస్తే దానిపై వడ్డీ సైతం ఉంటుంది.


2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను అప్‌డేటెడ్‌ రిటర్నులు దాఖలు చేసేందుకూ మార్చి 31 వరకూ వీలుంది.
పెట్టుబడులు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాత పన్ను విధానంలో కొనసాగాలి అనుకున్న వారు పెట్టుబడులు ఈ నెలాఖరు లోపు పెట్టుబడులు పెట్టాల్సిందే. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌), పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, జాతీయ పొదుపు పత్రాలను ఎంచుకోవచ్చు. ఇందులో సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 వరకూ జమ చేయొచ్చు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు ప్రీమియాలను మర్చిపోకుండా చెల్లించండి.

మహిళా సమ్మాన్‌..
బాలికలు, మహిళలకు ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌’లో జమ చేసేందుకు చివరి తేదీ మార్చి 31. ఇందులో రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.2లక్షల వరకూ పొదుపు చేయొచ్చు. ఇందులో వార్షిక వడ్డీ రేటు 7.5 శాతం. ప్రతి మూడు నెలలకోసారి చక్రవడ్డీ విధానంలో లెక్కిస్తారు. సర్టిఫికెట్‌ తీసుకున్న రెండేళ్ల తర్వాత డబ్బు వెనక్కి వస్తుంది.

ప్రత్యేక ఎఫ్‌డీలు..
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను అందిస్తున్నాయి. వీటికి గడువు తేదీ ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కాస్త అధిక వడ్డీని ఆశిస్తున్నవారు తమ పెట్టుబడులను ఈ పథకాల్లోకి మళ్లించే విషయాన్ని పరిశీలించవచ్చు.