ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో ఆ సందర్భానికి తగిన వస్తువులను తీసుకువెళ్లి విశిష్టమైన బహుమతిగా ఇవ్వడం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అలవాటు.
ఆ అలవాటు ప్రకారమే ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించిన సమయంలో ఆయన పార్లమెంటు ప్రాంగణంలోని మట్టిని, నీటిని తెచ్చారు. అలాగే మోడీ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోను ఆయన ఏమిస్తారా? అనేది ఉత్కంఠగా చూడటం దేశప్రజలకు అలవాటుగా మారిపోయింది.
అయోధ్యలో ప్రధానమంత్రి చేతులమీదగా రాంలాలాను సత్కరించిన సంగతి తెలిసిందే. ఆయన చేతిలో ప్రత్యేక వెండి పళ్లెంతో బాలరాముడి దగ్గరకు చేరుకున్నారు. పళ్లెంలో ఎర్రటి దుస్తులతో పాటు, వెండి గొడుగుతో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆధ్యాత్మిక పరమైన వేడుకలు జరిగే సమయంలో దేవతలను అలంకరించడానికి, కీర్తించడానికి వెండి పందిరిని బహుమతిగా ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది.
పూర్వకాలంలో మహారాజుల సింహాసనాలపై వెండి పందిరిని ఉంచేవారు. రాజుకు చిహ్నంగా రఘురాముడు ఉన్నాడు కాబట్టి అతనికి గౌరవ చిహ్నంగా ప్రధానమంత్రి మోడీ వెండి గొడుగును సమర్పించుకున్నారు. వెండి పందిరి అనేది శక్తిని సూచిస్తుంది. హిందూ మతంలోని దేవుళ్ల శక్తిని గొడుగు సూచిస్తుంటుంది. అందుకే ప్రతి ఆలయంలో శ్రీరాముడి విగ్రహంపై ఛత్రం ఉండి ఆయన వైభవాన్ని తెలియజేస్తుంటుంది. అలాగే శ్రీరాముడి రఘుకుల వంశాన్ని కూడా సూచిస్తుంటుంది. రాంలాల విగ్రహంలోని వెండి పందిరి కూడా శ్రీరాముడి ప్రకాశాన్ని, కీర్తిని తెలియజేస్తుంది.