ఏపీలో అన్నా క్యాంటీన్ లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు.. ఎవరీ డొక్కా సీతమ్మ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014-2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నిరుపేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే అన్న క్యాంటీన్లను నిర్వహించింది.


దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఐదు రూపాయలకే నిరుపేదలకు భోజనం పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం రాగానే మూసివేసింది.

అన్నా క్యాంటీన్ లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ లు

దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ అన్న క్యాంటీన్లు నిర్వహిస్తామని టిడిపి కూటమి నేతలు, టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు.ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మాత్రమే కాకుండా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా రాబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.

పవన్ డొక్కా సీతమ్మ క్యాంటీన్ ల కారణం ఏంటి?

పిఠాపురంలో జనసైనికుల సమావేశంలో మాట్లాడిన ఆయన డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలలోని వారికి డొక్కా సీతమ్మ అంటే ఎవరో తెలుసు కానీ, పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో ఇప్పుడు డొక్కా సీతమ్మ ఎవరు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. డొక్కా సీతమ్మ పేరుతోనే ఎందుకు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అన్నది ఆసక్తిని కలిగిస్తుంది.

నిత్యన్నదాత .. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ

డొక్కా సీతమ్మ ఉభయగోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందారు. డొక్కా సీతమ్మ గోదావరి ప్రాంతాలలో ఆకలిగొన్నవారికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా గుర్తింపు పొందారు. గోదావరి జిల్లాలలో లంక గ్రామాలకు తరచుగా వరదలు వస్తూ ఉండటం వల్ల చాలామంది వరదల దెబ్బకు వసతి, భోజన సదుపాయాలు లేక ఇబ్బందులు పడేవారు. అటువంటి వారందరినీ ఆదుకుని వారికి వసతి, భోజన సదుపాయాలను కల్పించిన ఉదాత్త మహిళ డొక్కా సీతమ్మ.

డొక్కా సీతమ్మ చరిత్ర తెలియటం కోసం పవన్ నిర్ణయం

అన్నదానం చేసి మానవత్వానికి అర్థం చెప్పిన డొక్కా సీతమ్మ పేరు భారత దేశ వ్యాప్తంగా అప్పట్లో మారుమోగింది. ఈ క్రమంలోనే అపర అన్నపూర్ణగా గుర్తింపు పొందిన డొక్కా సీతమ్మ గారి పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ద్వారా మరుగున పడిపోతున్న అటువంటి వారి చరిత్రను జనాలకు తెలియజేసినట్లు అవుతుందని భావించారు పవన్ కళ్యాణ్.

డొక్కా సీతమ్మ క్యాంటీన్ లకు చంద్రబాబుకు పవన్ విజ్ఞప్తి

అందుకే డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్టుగా దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా పేర్కొన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రకటన కారణంగా ప్రస్తుతం డొక్కా సీతమ్మ పేరు ప్రతి ఒక్కరికి తెలిసినట్లయింది.