ప్రతి ఒక్కరూ తమకంటూ సొంత ఇల్లుని నిర్మించుకోవాలని కలలు కంటారు. ప్రజలు తమ జీవిత సంపాదనను పెట్టుబడి పెట్టడం ద్వారా అందమైన, సౌకర్యవంతమైన ఇంటిని నిర్మించాలని ఆలోచిస్తారు.
అయితే కొన్నిసార్లు కొన్ని తప్పులు తెలియకుండానే లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల జరుగుతాయి. ఆ తరువాత పెద్ద ఇబ్బందులకు కారణమవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణంలో చేసే ఈ తప్పులు ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాదు ఇంట్లో ప్రతికూల శక్తి, ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తెస్తాయి. ఇల్లు నిర్మించేటప్పుడు ఏ తప్పులను నివారించాలో రోజు తెలుసుకుందాం..
ఇల్లు నిర్మించేటప్పుడు ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి
భూమి ఎంపికలో నిర్లక్ష్యం.
వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించే ముందు, భూమి ఎంపిక చాలా ముఖ్యం. భూమి త్రిభుజాకారంలో లేదా కోతకు గురికాకూడదు. ఈశాన్య దిశ నుంచి (ఈశాన కోణం) వెడల్పుగా, నైరుతి (నైరిత్య కోణం) దిశ ఇరుకైన భూమి ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
దిశలను తప్పుగా అంచనా వేయడం
ఇంటి నిర్మాణానికి ప్లాన్ చేసేటప్పుడు సరైన దిశలను నిర్ణయించడం చాలా ముఖ్యం. ప్రధాన ద్వారం ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నైరుతి దిశలో ప్రవేశ ద్వారం అశుభం, వ్యాధులు, ఇబ్బందులను పెంచుతుంది.
వంటగది తప్పుడు దిశ
వంటగది స్థలం అగ్ని మూలకంతో ముడిపడి ఉంది. కనుక దీనిని ఆగ్నేయ (అగ్ని కోణం) దిశలో మాత్రమే నిర్మించాలి. ఈశాన్య దిశలో వంటగదిని నిర్మించడం వల్ల మానసిక ఒత్తిడి, కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
టాయిలెట్-బాత్రూమ్ తప్పు స్థానం
ఈశాన్య దిశలో టాయిలెట్ లేదా బాత్రూమ్ నిర్మించడం చాలా అశుభకరమని భావిస్తారు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. దక్షిణం లేదా పడమర దిశలో బాత్రూమ్ లేదా టాయిలెట్ నిర్మించడం మంచిది.
బెడ్ రూమ్ దిశ, పడుకునే స్థానం
ప్రధాన పడకగది నైరుతి దిశలో ఉంచడం ఉత్తమం. నిద్రించేటప్పుడు తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండాలి. తల ఉత్తరం వైపు ఉంచి నిద్రించడం వల్ల మానసిక రుగ్మతలు వస్తాయి.
నీటి వనరు తప్పు స్థానం
ఈశాన్య దిశలో నీటి ట్యాంక్ లేదా బోర్‌వెల్, బావి వంటి భూగర్భ నీటి వనరులను నిర్మించడం శుభప్రదం. ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నైరుతి దిశలో ఉంచాలి. ఇది ఆర్థిక పరిస్థితిని బలంగా ఉంచుతుంది.
వెంటిలేషన్, లైటింగ్ లేకపోవడం
సహజ కాంతి, గాలి ప్రవేశించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలో కిటికీలు, బహిరంగ ప్రదేశాలు ఉండాలి. మూసివేసిన, చీకటిగా ఉన్న ఇళ్లలో ప్రతికూల పరిస్థితిలు ఏర్పడతాయి. రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడతారు.
మెట్ల తప్పు దిశ
ఇంట్లో మెట్లు దక్షిణం లేదా పశ్చిమం దిశలో నిర్మించాలి. ఎల్లప్పుడూ నైరుతి నుంచి ఈశాన్య దిశకు మెట్లు ఎక్కడం మంచిది. ఈశాన్య దిశలో మెట్లు నిర్మించడం చాలా అశుభం.
బ్రహ్మస్థానాన్ని మూసివేయవద్దు.
ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఇక్కడ ఎటువంటి బరువైన వస్తువులు లేదా నిర్మాణ పనులు ఉండకూడదు. ఈ స్థలాన్ని ఎల్లప్పుడూ తెరిచి, శుభ్రంగా ఉంచండి. ఇది ఇల్లు అంతటా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది.
ఇల్లు కట్టేటప్పుడు ఈ వాస్తు నియమాలను పాటించడం ద్వారా మీ ఇంటిని అందంగా మార్చుకోవడమే కాదు ఇంటిని సానుకూల శక్తితో నింపడం ద్వారా ఆనందం, శ్రేయస్సును కూడా నిర్ధారించుకోవచ్చు. ఒక ముందు జాగ్రత్త భవిష్యత్తులో అనేక సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. కనుక ఎవరైనా సరే తమ కలల ఇంటిని నిర్మించే సమయంలో ఈ ముఖ్యమైన వాస్తు చిట్కాలను దృష్టిలో ఉంచుకోవడం మర్చిపోవద్దు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.