వచ్చీరాని ఆటలిక చెల్లవ్‌!!.. పకడ్బందీగా డ్రైవింగ్‌ పరీక్ష

అధునాతన ట్రాక్‌లో విఫలమవుతున్న వారే ఎక్కువ


గంభీరంలో నూతన డ్రైవింగ్‌ ట్రాక్‌

మాధవధార, న్యూస్‌టుడే: గతంలో మాన్యువల్‌ విధానంలో డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేసేవారు.

అప్పట్లో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ)లదే కీలక పాత్ర. వీరే లైసెన్సుల జారీ చేసేశారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరుగు తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువె త్తడంతో లెసెన్సుల జారీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 27 నుంచి ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ను తీసుకొచ్చింది. ఇదంతా సాఫ్ట్‌వేర్‌ ఆధారితం. కేంద్రం నిధులు రూ.కోటితో ట్రాక్‌లో సీసీ కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. డ్రైవింగ్‌ సరిగా చేయకపోయినా ఎలాగోలా లైసెన్సు తెచ్చుకోవచ్చు అనుకునేవారి ఆటలు ఈ ట్రాక్‌ వల్ల సాగడం లేదు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షకు హాజరవుతున్న వారిలో ఎక్కువ మంది విఫలమవుతున్నారు.

35 శాతమే ఉత్తీర్ణత: ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరిలో 40 స్లాట్లు, ఏప్రిల్‌ 60 స్లాట్లు, మే 20 నుంచి 100 స్లాట్లకు పెంచారు. ప్రతి రోజు 80 మంది డ్రైవింగ్‌ పరీక్షలకు హాజరవుతున్నా అందులో కేవలం 30 నుంచి 35 శాతం మాత్రమే ఉత్తీర్ణులు అవుతున్నారు. బాగా డ్రైవింగ్‌ వచ్చిన వారు కూడా ట్రాక్‌లో చిన్నపాటి తప్పిదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ‘8’ ‘ఎస్‌’ ‘టీ’ ట్రాక్‌లో వెళ్లేటప్పుడు తికమక పడుతున్నారు. చాలా మంది సెన్సార్లకు తాకడంతో ఫెయిల్‌ అవుతున్నారు.

మూడోసారి గట్టెక్కుతున్నారు: ద్విచక్రవాహనాల పరీక్షకు నాలుగు స్టేజ్‌లు, కార్లకు మూడు, భారీ వాహనాలకు రెండు స్టేజ్‌లు ఉంటాయి. ద్విచక్రవాహన పరీక్షకు హాజరైన వారు కాళ్లు కింద పెట్టినా, ట్రాక్‌ పక్కన ఉన్న సెన్సార్లకు తగిలినా, గ్రీన్‌లైట్ రాకుండా ముందుకెళ్లినా ఆటోమేటిక్‌గా ఫెయిలవుతున్నారు. లైట్ మోటారు వాహనాలు(ఆటో, కార్ల) డ్రైవింగ్‌ పరీక్షలో స్టీరింగ్‌ ముందు కెమెరా కూడా ఏర్పాటు చేస్తారు. తల ఎలా తిప్పుతున్నారో కూడా అందులో నమోదవుతుంది. ఇటువంటి నిబంధనలు పక్కాగా ఉండటంతో తొలిసారి ఎక్కువ మంది ఫెయిలవుతున్నారు. వీటి గురించి బాగా తెలుసుకుని రెండోసారి, మూడోసారి గట్టెక్కుతున్నారు.

అవగాహన కల్పించకపోవడమే..

ల్‌ఎల్‌ఆర్‌ పరీక్షకు హాజరవుతున్న వారికి ముందుగా ట్రాఫిక్‌ నిబంధనలపై అరగంట పాటు శిక్షణ ఇచ్చి, కంప్యూటర్‌ పరీక్షకు పంపిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. నూతన విధానంలో ట్రాక్‌పై ఏ విధంగా డ్రైవింగ్‌ చేయాలనే విషయాన్ని సంబంధిత సిబ్బంది చోదకులకు అవగాహన కల్పించకపోవడం వల్లనే ఎక్కువ మంది విఫలమవుతున్నారు. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసిన వారికి ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు, సిగ్నళ్లు, సెన్సార్ల పని తీరును వివరించడం తదితరాలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో చోదకుడు నేరుగా ట్రాక్‌పై వెళ్లి డ్రైవింగ్‌ చేస్తుండటంతో విఫలమవుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.