కోచ్‌గా ఇన్నింగ్స్‌ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలవాలని అన్నాడు. ‘‘తెల్లబంతితో ఆ మూడూ మనం సాధించాం. ఇక ఎరుపే ఉంది. అది కూడా సాధించండి’’ అని డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లితో ద్రవిడ్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
ద్రవిడ్ దృష్టిలో మూడు అంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మూడు ప్రపంచ ట్రోఫీలు అన్నమాట. ఒకటి టీ20 ప్రపంచకప్, రెండోది వన్డే ప్రపంచకప్.. మూడోది ఛాంపియన్స్ ట్రోఫీ. ఆటగాడిగా కోహ్లి ఈ మూడూ గెలిచాడు. ఇక మిగిలింది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్పే. భారత జట్టు రెండు సార్లు.. 2021, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ గెలిచాక కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా ప్రస్తుతం తుపాను కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. జట్టు ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నట్లు సమాచారం. సహాయ సిబ్బంది, కుటుంబాలు, అధికారులు సహా భారత బృందంతో మొత్తం 70 మంది సభ్యులున్నారు.