పర్ఫెక్ట్‌ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు

www.mannamweb.com


సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లలో సంబరాలు మొదలవుతాయి. ఉపాధి కోసం దేశ విదేశాలకు తరలిపోయిన పిల్లలంతా రెక్కలు కట్టుకొని మరీ సొంత ఊరిలో వాలిపోతారు.

పిండివంటలు, కొత్తబట్టలు, గొబ్బెమ్మలు.. ఇలా సంకురాత్రి సంబరాలతో పల్లెలన్నీ మురిసి పోతాయి.

మరి అరిసెలు లేని సంక్రాంతిని అస్సలు ఊహించగలమా. అందులోనూ ఈ చల్లని వేళ, శ్రేష్టమైన నువ్వులద్దిన అరిసెలు తింటూ ఉంటే… పంటికింద నువ్వులు అలా తగులుతుంటే.. ఆహా అని మైమరిచిపోమూ. ఆరోగ్యం, ఆనందం రెండింటినీ అందించే అరిసెలు, అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన, మరో ముఖ్యమైన స్వీట్‌ క​జ్జికాయలను సులువుగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!

నువ్వుల అరిశెలు

కావలసినవి: బియ్యం – ఒక కిలో; బెల్లం పొడి – 800 గ్రా.; నువ్వులు, గసగసాలు- కొద్దిగా; నెయ్యి – కేజీ

తయారీ

బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని జల్లించాలి. పిండి గాలికి పొడిబారకుండా ఒకపాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి.

ఇప్పుడు పాకం సిద్ధం చేసుకోవాలి. మందపాటి పాత్రలో ఒక గ్లాసు నీరు పోసి బెల్లం పొడి వేసి పాకం వచ్చేదాకా తెడ్డుతో కలుపుతూ మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించేసి బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా తెడ్డుతో కలపాలి.

బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకంపిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని గసాలు, నువ్వులలో అద్ది పాలిథిన్‌ పేపర్‌ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది కాగిన నెయ్యిలో వేసి దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నెయ్యి కారిపోయేటట్లు వత్తాలి.

గమనిక: అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే ముదురు పాకం పట్టాలి. ఈ అరిశెలు పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి.

నువ్వుల కజ్జికాయలు

కావలసినవి : మైదా లేదా గోధుమ పిండి – కేజి; నువ్వులు – కేజి; బెల్లం పొడి – 800 గ్రా.; ఏలకులు- 10 గ్రా. జీడిపప్పు- వందగ్రాములు; నూనె- కేజీ;

ఇదీ :సోషల్‌ మీడియా DPDP నిబంధనలు : 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిరి

తయారీ:

పిండిని చపాతీలకు కలుపుకున్నట్లుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి.

నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత కాస్త పలుకుగా గ్రైండ్‌ చేయాలి. బెల్లం పొడి, యాలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి.

గోధుమ పిండిని చిన్న గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని ప్రెస్సర్‌తో పూరీలా వత్తుకుని దానిని సాంచా (కజ్జికాయ చేసే చెక్క మౌల్డ్‌) లో పరిచి ఒక స్పూను నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని, ఒక జీడిపప్పును పెట్టి సాంచా మూత వేయాలి.

సాంచాలో నుంచి తీసి కజ్జికాయను మరుగుతున్న నూనెలో వేసి దోరగా కాలనివ్వాలి. ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి.