ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ అలర్ట్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు..!

www.mannamweb.com


Election Results 2024: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ అలర్ట్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు..!

లోక్‌సభ తోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ మరింత అలర్ట్ అయింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధంగా ఉండాలని సూచించింది. మరోవైపు జూన్ 4న నిర్వహించనున్న కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ విడుదల తర్వాత ఎన్నికల కమిషన్ మరింత అప్రమత్తమైంది. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు కీలక సూచనలు చేశారు ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్ మీనా. తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో భావోద్వేగాలు అదుపుతప్పే అవకాశం ఉందన్నారు సీఈఓ. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని వెంటనే బయటికి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక, హింసాత్మక ఘటనల విషయంలో కఠినంగా వ్యవహారించాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కీలకమైన పరిస్థితుల్లో తప్పుడు వార్తలను వెంటనే ఖండించాలని చెప్పారు సీఈఓ మీనా. కఠినమైన పరిస్థితుల్లోనే శాంతిభద్రతలను కాపాడుకోవడం ఎంతో అవసరమన్నారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి సవాళ్లను ఎదుర్కోవాలని తెలిపారు ముకేశ్ కుమార్ మీనా. మరోవైపు ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ చిన్న ఇబ్బంది కలిగించినా.. ఉపేక్షించబోమని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ఏజెంట్లు అలజడి సృష్టిస్తే, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌంటింగ్ రోజు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా పోలీసుల నిఘా కొనసాగుతుందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!

అటు తెలంగాణలో కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌. 17 ఎంపీ స్థానాలకు జూన్‌ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటల నుంచి ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ షురూ అవుతుందని ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్స్‌ వారీగా గరిష్టంగా 24 రౌండ్లు, కనిష్టంగా 13 రౌండ్లలో కౌంటింగ్‌ జరుగుతుందని తెలిపారు సీఈవో వికాస్‌రాజ్‌. రాష్ట్రంలోని అన్ని కౌంటింగ్ సెంటర్లలో.. ప్రతి మూలా కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు.

కౌంటింగ్ సెంటర్ల దగ్గర బారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని వికాస్ రాజ్ వివరించారు. నాలుగు అంచెల భద్రత ఉంటుందన్నారు. ఎక్కువ మంది గుమిగూడొద్దని సూచించారు. ఇక..కౌంటింగ్ సెంటర్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సిబ్బంది సెల్‌ఫోన్లకు పర్మిషన్ ఉండదని స్పష్టం చేశారు. 10వేల మంది సిబ్బంది.. 2400మంది మైక్రో అబ్జర్‌వర్లు కౌంటింగ్‌లో పాల్గొంటారన్నారు సీఈవో వికాస్‌రాజ్‌. మరోవైపు.. కౌంటింగ్ రోజు మద్యం షాపులు బంద్ ఉంటాయని చెప్పారు

చొప్పదండి, యాకుత్‌పురా, దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. ఆర్మూర్, భద్రాచలం, ఆశ్వరావుపేటలో కేవలం 13 రౌండ్లలోనే ఫలితాలు వెలువడుతాయని వివరించారు. మిగతా నియోజకవర్గాల్లో 18, 19, 20 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని వికాస్ రాజ్ తెలిపారు.