ఏపీలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌లకు ప్రయత్నాలు

విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడారు. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో విశాఖలో సెంచూరియన్ యూనివర్సిటీ ఏర్పాటైందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల సంస్థాగత మార్పులకు ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామన్నారు.


రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతిష్ఠాత్మక బిట్స్‌ పిలానీ సంస్థకు అమరావతిలో 70 ఎకరాలు కేటాయించామని.. టాటా లాంటి సంస్థలు కూడా వస్తున్నాయని వివరించారు. డీప్‌ టెక్‌ యూనివర్సిటీ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విశాఖలో ఏఐ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ రావాల్సి ఉందన్నారు. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఏపీలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.