Employees Transfers Schedule: బదిలీల సందడి!.. బదిలీల షెడ్యూల్‌ ఇదీ

www.mannamweb.com


రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు షెడ్యూల్‌ ప్రకటించడంతో కసరత్తు మొదలైంది. 2018 తర్వాత సాధారణ బదిలీలు జరుగుతుండటంతో శాఖలవారీగా ఖాళీలు, సీనియారిటీ జాబితాతో పాటు తప్పనిసరి బదిలీ అయ్యే అధికారులు, ఉద్యోగుల జాబితా రూపొందిస్తున్నారు.

అటెండర్ల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు స్థానచలనం తప్పనిసరి కావడంతో పలువురు అప్పుడే పైరవీలు మొదలుపెట్టారు. మరికొందరు అదృష్టాన్ని విశ్వసిస్తున్నారు. సంబంధిత హెచ్‌వోడీలు జూలై 5న నుంచి జూలై 8 వరకు ఖాళీల ప్రదర్శన, సీనియారిటీ జాబితాతో పాటు బదిలీ తప్పనిసరి అయ్యే ఉద్యోగుల జాబితా పెట్టనున్నారు.

మొదలైన పైరవీలు

పట్టణాలు, కలెక్టరేట్‌ను వీడని అధికారులు, ఉద్యోగులు అప్పుడే పైరవీలు మొదలుపెట్టారు. తమకున్న పలుకుబడితో ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. అనుకూలమైన ప్రాంతానికి పోస్టింగ్‌ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నేతలు, ప్రముఖ ప్రజాప్రతినిధులు ఇలా ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కీలకమైన స్థానాల్లోనే ఉండేలా కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఈలు, ఏవోలు, ఏపీవోలతో పాటు ఇరిగేషన్‌, డీఆర్డీవో తదితర శాఖల అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

తప్పని స్థానచలనం..

సాధారణ బదిలీల్లో భాగంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి రెండేళ్లు ఒకేచోట పనిచేసి ఉంటే బదిలీకి అర్హుడు. నాలుగేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి. గరిష్టంగా 40 శాతం ఉద్యోగులకు మించకుండా బదిలీలు జరగనున్నాయి.

స్పౌజ్‌ కేటగిరీతో పాటు 2025 జూన్‌ 30 నాటికి ఉద్యోగవిరమణ చేసే వారు, 70 శాతం వైకల్యం, మానసిక వికలాంగులతో కూడిన పిల్లలున్న, వితంతువులు, మెడికల్‌ గ్రౌండ్స్‌ ఉన్న వారికి ప్రాధాన్యతనివ్వనున్నారు. కాగా శాఖలవారీగా హెచ్‌వోడీ సంబంఽధిత ఉద్యోగుల సీనియారిటీ జాబితా ప్రచురించాలి. ఈ నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల నుంచి ఐదు ఆప్షన్లు తీసుకోనున్నారు. అయితే బదిలీల గైడ్‌లైన్స్‌ వాణిజ్య పన్నులు, ఎకై ్సజ్‌, రవాణా, విద్య, అటవీ, పోలీసు శాఖలకు వర్తించవని స్పష్టం చేసింది.

కేడర్‌ వారీగా…

బదిలీలను రాష్ట్రస్థాయి, మల్టిజోన్‌, జోనల్‌, జిల్లా కేడర్‌గా విభజించారు. ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేసి బదిలీ ఉత్తర్వులను జారీ చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో పోస్టులకు శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించనుండగా హెచ్‌వోడీ కన్వీనర్‌గా, అదనపు, సంయుక్త, ఉప కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు.

మల్టిజోనల్‌, జోనల్‌ స్థాయి పోస్టుల బదిలీలకు హెచ్‌వోడీ చైర్మన్‌గా కార్యదర్శి సూచించినవారు సభ్యులుగా.. హెచ్‌వోడీ సూచించినవారు కన్వీసర్‌గా వ్యవహరించనుండగా కేడర్‌ పోస్టులకు కలెక్టర్‌ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్‌, డీఆర్వో సభ్యులుగా ఉండనుండగా శాఖకు సంబంధించిన జిల్లా అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

బదిలీ షెడ్యూల్‌ ఇదీ

జులై 5 నుంచి 8 వరకు: ఉద్యోగులు/ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు, సీనియారిటీ జాబితా, ఖాళీల ప్రదర్శన, బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితా
9 నుంచి12 వరకు: ఉద్యోగుల ఆప్షన్లతో కూడిన దరఖాస్తుల స్వీకరణ
13-18 వరకు: దరఖాస్తుల పరిశీలన, మాస్టర్‌ లిస్ట్‌ తయారీ
19-20 వరకు: బదిలీ ఉత్తర్వులు, తదుపరి మూడు రోజుల్లో విధుల్లో చేరిక