ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు కృత్రిమ మేధను వాడుతున్నాయి. రైటింగ్, కోడింగ్, డేటా వర్క్ వంటి ఎన్నో డెస్క్ జాబ్స్‌ను ఏఐ చేస్తోంది. ఇప్పటికే ఏఐ వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.
మానవ జీవన విధానాలను మార్చే సామర్థ్యం ఏఐకి ఉంది.
ఏఐ ఇప్పటికే ఎన్నో సంచనాలు సృష్టిస్తోంది. ఏఐ గురించి ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ మాతృసంస్థ) సీఈవో శామ్ ఆల్ట్‌మన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు.
డెస్క్ జాబ్స్ పోతున్నాయంటూ అందరూ ప్రధానంగా ఏఐ గురించే ఆందోళన చెందుతున్నారని, కానీ, అంతకన్నా భారీ మార్పు రాబోతుందని చెప్పారు. సమీప భవిష్యత్తులోనే మరమనుషులు (హ్యూమనాయిడ్ రోబోట్లు) మన నిత్య జీవితంలోకి వచ్చేస్తారని, వీధుల్లో నడవడం చూస్తామని శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.
స్మార్ట్ రోబోలు నిజంగా ఏమి చేయగలవో ప్రపంచం ఇంకా చూడలేదని ఆయన చెప్పారు. స్మార్ట్ రోబోలు వస్తున్నాయని, అయితే, వాటి ప్రభావాన్ని హ్యాండిల్ చేసేంత సిద్ధంగా ప్రపంచం లేదని అన్నారు.
సైన్స్ ఫిక్షన్ మూవీల్లో మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా సమీప భవిష్యత్తులో మన జీవితం మారిపోతుందని శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. మనం రోడ్లపై నడుచుకుంటూ వెళ్తుంటే మన వెనకాల రోబోలు కూడా నడవడాన్ని చూస్తుంటామని చెప్పారు. జాబ్స్, టెక్నాలజీ గురించి ప్రజల ఆలోచన తీరు మారిపోతుందని తెలిపారు.