ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోదీ కూడా వైజాగ్ వస్తున్నారు.
జూన్ 21న విశాఖ వేదికగా సాగర తీరంలో ఐదు లక్షల మందితో యోగాసనాలు వేయించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకే ఆ రోజు అధికారులు యంత్రాంగమంతా ఈ కార్యక్రంలో నిమగ్నమై ఉంటారు. ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువ అందుబాటులో ఉంటుంది. అలాంటి సందర్భంలో పరీక్షలు పెడితే అభ్యర్థులు ఇబ్బంది పడతారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఆ అభ్యర్థులకు జులై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మార్పులు చేస్తూమెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జులై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలు మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025 website: https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని ఎం.వికృష్ణారెడ్డి కోరారు.