ఏపీలో ఎన్డీయే కూటమి గెలుపు… వాషింగ్టన్‌ డీసీలో ప్రవాసాంధ్రుల సంబరాలు

www.mannamweb.com


ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు…పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు.

అమరావతి: ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు…పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు. వాషింగ్టన్‌ డీసీలో తెదేపా జెండాలు ప్రదర్శిస్తూ భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. సీఎం బాబు…జై తెదేపా…జై ఎన్టీఆర్‌ నినాదాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, భాజపా ఎమ్మెల్యే సుజనాచౌదరి, తెదేపా ఎమ్మెల్యే సొంగా రోషన్‌ తదితరులు మాట్లాడారు. ‘‘ఎన్నికలకు ముందు పలువురు ఎన్నారైలు రాష్ట్రానికి వచ్చి..ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. జన్మభూమి రుణం తీర్చుకున్నారు’’ అని పెమ్మసాని అభినందించారు. రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలది కీలకపాత్ర అని సుజనాచౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఆర్థిక నేరస్థులు, హంతకులకు చోటులేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వడానికి ఎన్నారైలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు వాషింగ్టన్‌ డీసీలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సుందరపు విజయ్‌కుమార్, జయరాం కోమటి, సతీష్‌ వేమన, భాను మాగులూరి, యశ్‌ బొద్దులూరి తదితరులు పాల్గొన్నారు.


వాషింగ్టన్‌ డీసీలో ప్రవాసాంధ్రుల కార్ల ర్యాలీ

కాలిఫోర్నియాలో…

అమెరికాలోని బే ఏరియాకు చెందిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమోంట్‌ నగరం సెంట్రల్‌ పార్కులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేసు కోసి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 250 కార్లతో మూడు పార్టీల జెండాల్ని ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. జై చంద్రబాబు, జై పవన్‌కల్యాణ్‌ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు పాలనా దక్షత, పవన్‌కల్యాణ్‌ నిబద్ధత, మోదీ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోనుందని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 900 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ..పెమ్మసాని చంద్రశేఖర్, సుజనాచౌదరి, లోకం మాధవి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడారు. కోగంటి వెంకట్, శ్రీనివాస్‌ తాడపనేని, గాంధీ పాపినేని, జగదీశ్‌ గింజుపల్లి తదితరులు పాల్గొన్నారు.


వాషింగ్టన్‌ డీసీలో కేకు కోస్తున్న మన్నవ సుబ్బారావు, సతీష్‌ వేమన, యశ్, భాను మాగులూరి, సుధీర్‌ కొమ్మి తదితరులు