ఆధార్‌ – రేషన్‌ కార్డు అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు

ఆధార్‌ – రేషన్‌ కార్డును లింక్‌ చేయనివారికి కేంద్రం మరో అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.


2024 జూన్‌ 30 తో గడువు ముగియనుండగా, సెప్టెంబర్‌ 30 వరకు పెంచింది. రేషన్‌ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్‌- రేషన్‌ కార్డ్‌ను లింక్‌ చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది. ఇప్పటికే చాలామంది ఆధార్‌ అనుసంధానం పూర్తి చేశారు. ఆధార్‌- రేషన్‌ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతోపాటు నకిలీ రేషన్‌ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇప్పటికీ ఆధార్‌- రేషన్‌ కార్డ్‌ అనుసంధానం చేయనివారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం సమీపంలోని రేషన్‌ షాప్‌ లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ సాయంతో లింక్‌ చేయించుకోవచ్చు. ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డుతోపాటు అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌తో అనుసంధానం పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా అనుసంధానం చేసే సదుపాయం కూడా ఉంది. ఇందుకోసం రాష్ట్ర పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ పోర్టల్‌కు వెళ్లి link Aadhaar with the active ration card ఆప్షన్‌ను ఎంచుకోండి. రేషన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌ నంబర్‌, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్‌ ఫోన్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడంతో ఆధార్‌ అనుసంధానం పూర్తవుతుంది.