Eye Sight Improving Tips : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. ఇవి మన జీవితంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయని చెప్పవచ్చు. మన శరీర ఆరోగ్య కోసం ఎంత శ్రద్ద తీసుకుంటామో మన కళ్ల ఆరోగ్యం గురించి కూడా అంతే శ్రద్ద తీసుకోవాలి. కానీ నేటి తరుణంలో మనలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా దృష్టికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. కంటి ఆరోగ్యం మెరుగుపడి దృష్టి లోపాలు తగ్గాలంటే టివి, సెల్ ఫోన్ వంటి వస్తువుల వాడకాన్ని తగ్గించడంతో పాటు సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యం మరియు చూపు మెరుగుపడాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. క్యారెట్, ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, గింజలతో పాటు జింక్, కాపర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
అలాగే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఏవైనా కంటి సమస్యలు ఉంటే మనం ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. దీంతో మనం తగిన నివారణ చర్యలు తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఉంటుంది. అదేవిధంగా చేతులతో తరుచూ కళ్లను తాకకూడదు. కళ్లను రుద్దకూడదు. అవసరమైతే మన చేతులను శుభ్రంగా కడిగి ఆ తరువాత కళ్లను తాకడం మంచిది. చేతులపై అనేక రకాల వైరస్, బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంటుంది. అదే చేతులతో కళ్లను తాకడం వల్ల కంటికి ఇన్పెక్షన్ లు వచ్చే అవకాశం ఉంది. కనుక చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. అలాగే కళ్లు పొడిబారకుండా ఉండడానికి గానూ రోజూ తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల కళ్లు పొడిబారకుండా ఉండడంతో పాటు కళ్ల ఎరుపుదనం కూడా తగ్గుతుంది. అలాగే రోజూ కంటి వ్యాయామాలు చేయడం కూడా చాలా అవసరం. కంటి వ్యాయామాలు చేయడం వల్ల కంటి కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది.
అలాగే రోజూ శారీరక వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో కంటికి కూడా రక్తప్రసరణ చక్కగా జరిగి కళ్లు సమర్థవంతంగా పని చేస్తాయి. అలాగే ల్యాప్ టాప్, టివి, సెల్ ఫోన్ వంటి వాటిని ఉపయోగించినప్పుడు లైటింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. తగినంత కాంతి లేకపోతే కళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీంతో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కళ్లు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ధూమపానానికి దూరంగా ఉండాలి. ధూమపానం చేయడం వల్ల మాక్యులర్ డిజెనరేషన్, కంటి శుక్లాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ధూమపానానికి దూరంగా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా కళ్లపై ఎండ, సూర్యకిరణాలు నేరుగా పడకుండా చూసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అద్దాలు ధరించడం మంచిది. అలాగే స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉన్నవారు మధ్య మధ్యలో విరామం ఇస్తూ ఉండాలి. దీని వల్ల కళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా ఉంటుంది. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడడంతో పాటు కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.