ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు(ఎఫ్‌బీసీ) ఏపీలోని కుటుంబాలకు అందనున్నాయి. వీటిలో రేషన్ కార్డులు, పింఛన్లు, పొదుపు సంఘాలు, కుటుంబ సమాచారం, గృహనిర్మాణ విభాగం అందించిన సమాచారం, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలన్నీ ఒకేచోట ఉంటాయి.
ఆయా కుటుంబాల విద్యుత్తు మీటర్లు, నెలవారీ బిల్లులు, పొలాల వివరాలు, ఈ-క్రాప్ పెట్టుబడి సాయం, ఇంటి చిరునామా వివరాలు సైతం ఇందులో కనిపిస్తాయి. ఎఫ్‌బీసీ కార్డులో ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ ఐడీని కేటాయిస్తారు. లబ్ధిదారులు ఏదైనా పథకం తమకు వద్దు అనుకుంటే ఈ యాప్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుల వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. ఆ యాప్‌లోకి వెళ్లి అన్ని కుటుంబాల లబ్ధిదారులు వారి వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఎఫ్‌బీసీ కార్డులలోని(Family Benefit Card) సమాచారాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నారు. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులలోని సమాచారం ఆధారంగా ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితిని ఏఐ అంచనా వేస్తుంది. దాని ఆధారంగా ఆయా కుటుంబాలకు ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాల వివరాలను విశ్లేషిస్తుంది. ఆయా ఫ్యామిలీల ఆర్థిక వికాసానికి ఇంకా ఎటువంటి స్కీమ్స్ అమలు చేయాలి అనేది ఈ ఏఐ టెక్నాలజీ సిఫారసు చేస్తుంది. ఆ సిఫారసులను ప్రభుత్వ అధికార వర్గాలు సమీక్షించి, క్షేత్ర స్థాయిలో ఆయా కుటుంబాల వాస్తవిక స్థితిగతుల గురించి తెలుసుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటాయి. వారికి ఇంకా ఏయే సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చాలి అనేది నిర్ణయిస్తాయి.
వాస్తవానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను జారీ చేయాలని మంత్రి నారా లోకేశ్ 2019లోనే భావించారు. ప్రపంచబ్యాంకుకు దీనిపై ప్రజంటేషన్ ఇచ్చారు. అప్పట్లోనే ఏపీ డేటా సెంటర్‌లో అన్ని వివరాలనూ అనుసంధానించే ప్రక్రియను చేపట్టారు. అయితే తదుపరిగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ దీని అమలును మరిచింది.