ఇంజనీరింగ్ విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లోని కొన్ని సబ్జెక్టులకు బదులు, ఇతర కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. అలాగే తమకు నచ్చని లేదా కఠినంగా ఉన్న సబ్జెక్టుల నుంచి మినహాయింపు కూడా పొందవచ్చు. ఈ విధానాన్ని ‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)’ అంటారు. విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైన ఈ విధానాన్ని దాదాపు దశాబ్దం తర్వాత జేఎన్‌టీయూ మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ విద్యా సంవత్సరం(2025-26) నుంచి సీబీసీఎ్‌సను అమలు చేసేందుకు కొత్త మార్గదర్శకాల (ఆర్25)ను రూపొందిస్తోంది. వాస్తవానికి మూడు దశాబ్దాల నుంచి జేఎన్‌టీయూలో అమలవుతున్నసీబీసీఎ్‌సను కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ప్రయోజనకరమైన సీబీసీఎస్ దేశవ్యాప్తంగా అమల్లోకి రాగా, జేఎన్‌టీయూ పరిఽధిలో మాత్రం అప్పటి ఉన్నతాధికారులు నీరుగారుస్తూ వచ్చారు. ఫలితంగా విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోలేక, నచ్చని సబ్జెక్టుల్లో పాస్ కాలేక ఏళ్ల తరబడి బ్యాక్‌లాగ్స్ బరువును మోస్తూనే ఉన్నారు. మంగళవారం జేఎన్‌టీయూలో జరిగిన బోర్డ్ స్టడీస్ చైర్మన్ల సమావేశంలో ఆర్-25 నిబంధనల్లో సీబీసీఎస్ అమలు, క్రెడిట్స్ మినహాయింపు, కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో మైనర్ డిగ్రీ ప్రవేశపెట్టడం వంటి అంశాలకు ఆమోదం లభించింది.
క్రెడిట్స్ మినహాయింపుతో బీటెక్ డిగ్రీ..
బీటెక్ విద్యార్థులు చదివే ప్రతి సబ్జెక్టుకు కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. డిగ్రీ పట్టా రావాలంటే నిర్దేశిత క్రెడిట్స్‌ను పొందాల్సి ఉంటుంది. 2016 నిబంధనలకు ముందు విద్యార్థులకు క్రెడిట్స్ మినహాయింపు సదుపాయం ఉండేది. సాధారణంగా బీటెక్ విద్యార్థులు నాలుగేళ్ల పాటు సుమారు 40 సబ్జెక్టులు చదువుతారు. క్రెడిట్స్ మినహాయింపు ఉండడంతో వాటిలో ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో పాస్ కాకపోయినా, కోర్సుకు ఉండే మొత్తం క్రెడిట్స్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన క్రెడిట్స్ లభించిన వారికి డిగ్రీ పట్టా ఇస్తారు. ఉదాహరణకు ఈ ఏడాది నుంచి బీటెక్ కోర్సుకు మొత్తం 164 క్రెడిట్స్ ఉండేలా ఉన్నతాధికారులు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు డిగ్రీ పొందడానికి కనీస క్రెడిట్స్ 160 ఉంటే సరిపోతుంది. దీంతో జేఎన్‌టీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివే బీటెక్ విద్యార్థులు తమ బ్యాక్‌లాగ్ (పాస్ కాని) సబ్జెక్టుల్లో ఒకటి లేదా రెండు సబ్జెక్టుల నుంచి మినహాయింపు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. క్రెడిట్స్ మినహాయింపు అమలుతో విద్యార్థులకు మేలు చేకూరుతుందని విద్యార్థి సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులతోనూ మైనర్ డిగ్రీలు చేసుకునేలా విద్యార్థులకు జేఎన్‌టీయూ అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్ తదితర కోర్ బ్రాంచ్ ల విద్యార్థులు సుమారు 18 క్రెడిట్స్ పొందేలా వేరే కోర్సుల్లోని సబ్జెక్టులతో మైనర్ డిగ్రీ తీసుకోవాలని సూచిస్తోంది. దీంతో విద్యార్థులు తమ అభిరుచి మేరకు కోర్సులు/సబ్జెక్టులను ఎంచుకొని సంతోషంగా రెండు డిగ్రీలు పొందేందుకు వీలవుతుందని ఆచార్యులు చెబుతున్నారు.
ఆ కోర్సులు ఇకపై మొక్కుబడి కాదు..
బీటెక్ విద్యార్థులకు ఇంజనీరింగ్ సబ్జెక్టులతో పాటు పర్యావరణ శాస్త్రం, భారత రాజ్యాంగం, మానవ విలువలు వంటి సబ్జెక్టులు ఉంటాయి. ఆయా అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన తప్పనిసరి నాన్ క్రెడిట్ సబ్జెక్టులను విద్యార్థులు మొక్కుబడిగా భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి తప్పనిసరి సబ్జెక్టులకూ 0.5-1 క్రెడిట్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో తప్పనిసరి సబ్జెక్టులను కూడా అభ్యసించేలా విద్యార్థులను ప్రోత్సహించినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. భావితరం ఇంజనీర్లలో ప్రపంచస్థాయి నైపుణ్యాలతో పాటు మానవ విలువలను కూడా పెంపొందించేలా నూతన మార్గదర్శకాలు (ఆర్25) రూపొందిస్తున్నామని, ఉపకులపతి సూచనల మేరకు నెలాఖరులోగా కొత్త నిబంధనలను విడుదల చేస్తామని జేఎన్‌టీయూ అకడమిక్ వ్యవహారాల డైరెక్టర్ వి.కామాక్షి ప్రసాద్ తెలిపారు.