ప్రతి వంటగదిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. అటువంటి మసాలా దినుసులలో మెంతి గింజలు ముఖ్యమైనది. మెంతులు బరువు తగ్గడానికి మాత్రమేకాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలోనూ సహాయపడతాయి.
మెంతులు పోషకాల భాండాగారం. వీటిల్లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుంచి రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వరకు మెంతులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
షుగర్, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు బరువు పెరుగడానికి కారణం అవుతాయి. బరువును అదుపులో ఉంచడంలో మెంతులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఊబకాయం వచ్చే అవకాశాలను తగ్గించడంలోనూ మెంతులు ఉపయోగపడుతుంది. కానీ చాలా మందికి మెంతి గింజలు తినే సరైన పద్ధతి తెలియదు.
మెంతికూర తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. తక్కువ ఆకలి ఉండటంతో మాటిమాటికి ఆహారాన్ని తినకుండా నివారిస్తుంది. ఇవి జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడతాయి. అయితే మంచి ఫలితాలను పొందడానికి కొన్ని మెంతి గింజలను వేడి నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. తర్వాత నీళ్లను వడకట్టి తాగాలి. ఈ నీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అలాగే.. 1/2 టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు కూడా సులభంగా తగ్గేందుకు సహాయపడుతుంది.
మెంతి గింజలను గాజు పాత్రలో నానబెట్టి, శుభ్రమైన గుడ్డలో కట్టి పెడితే సులువుగా మొలకెత్తుతాయి. మొలకెత్తిన మెంతి గింజలను సలాడ్‌లు, శాండ్‌విచ్‌లలో కలిపి తినవచ్చు. మెంతి గింజల్లోని పోషకాలన్నీ శరీరంలో కలుస్తాయి. మొలకెత్తిన మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులు, పసుపు కలిపి తింటే కూడా బరువు తగ్గుతారు. ఈ రెండు పదార్థాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శారీరక మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది బరువును తగ్గిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.