ఐటిసి గోడౌన్ లో అగ్ని ప్రమాదం – వంద కోట్ల విలువైన ప్రొడక్ట్స్ బూడిద

విశాఖపట్నం శివార్లలోని ఐటీసీ గోదాంలో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గండిగుండం దగ్గర జాతీయ రహదారిని అనుకుని వున్న ఫుడ్ ప్రొడక్ట్స్ గోడౌన్ మొత్తం కాలి బూడిదైంది.


మంటల తీవ్రతకు గోడౌన్ ఇనుప గడ్డర్లు మెల్ట్ అయిపోయి కూలిపోయాయి. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి డిజాస్టర్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. సెంట్ బాటిల్స్, పినాయిల్స్ లాంటివి ఉండటంతో మంటలను అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది.ఐటీసీ ఉత్పత్తులు అయినా ఫుడ్, సిగరెట్లు స్టాక్స్ నిల్వలు ఇందులో ఉన్నాయి. పూర్తిగా అగ్నికి ఆహుతైన ఈ గోదాములో రోజూ 300 మంది కార్మికులు పని చేస్తుంటారు. ప్రమాద సమయంలో సెక్యూరిటీ సిబ్బంది మినహా మిగిలిన కార్మికులు ఎవరు గోదాంలో లేరు.

వంద కోట్ల విలువైన ప్రొడక్ట్స్ బూడిద

అయితే, ఐటీసీ గోడౌన్ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 100 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్ట్స్ నేరుగా ఇక్కడకు తరలిస్తుంటారు. ఇక్కడి నుంచి ఒడిశా నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు పంపిణీ చేస్తుంటారు. ఈ స్థాయిలో స్టాక్ ఉన్న చోట్ల భారీ అగ్నిప్రమాదం జరగడం వెనుక కారణాలపై విచారణ కొనసాగుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. అర్ధరాత్రి మంటలు వ్యాపించగా 9 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.