నిర్మా వాషింగ్ పౌడర్ : జ్ఞాపకాల నుండి కంపెనీ పతనం వరకు! ఇదే అసలు కథ

1980లో ఒక చిన్న అమ్మాయి వాషింగ్ పౌడర్ నిర్మా కమర్షియల్ టీవీ యాడ్ పాట ద్వారా మెరిసింది. ఈ పాట నేడు భారతదేశంలో 1980s, 1990s జనరేషన్ వారికీ బాగా గుర్తుంటుంది. అప్పట్లో ఈ నిర్మా యాడ్ ఒక సెన్సేషన్, ప్రతి ఒక్కరి టివిలో వినిపిస్తుండేది. అయితే అసలు ఈ నిర్మా కథ ఏంటి.. మార్కెట్ని షేక్ చేసిన నిర్మా సర్ఫ్ ఇప్పుడు ఏమైంది.. కెమిస్ట్రీలో డిగ్రీ పొందిన కర్సన్ భాయ్ పటేల్ అనే యువకుడు ప్రభుత్వ సంస్థలో కెమిస్ట్‌గా పనిచేసేవాడు, అయితే చాలి చాలని జీతం సరిపోకపోవడంతో జీవనోపాధి కోసం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. తన తెలివిని, జీవించాలనే కోరికను కలిపి కర్సన్ భాయ్ ఒక కొత్త ఉత్పత్తి సృష్టించాడు, అదే బట్టల వాషింగ్ పౌడర్. ఇది తరువాత భారత చరిత్రలోనే ఒక భాగమైంది ఇంకా నేటికీ గుర్తుండిపోయేల చేసింది.


అతను తయారు చేసిన వాషింగ్ పౌడర్ పేరు “నిర్మ”. ఈ పేరు ఆయన కుమార్తె నిరుపమ పేరు నుండి పుట్టింది. చాలా తక్కువ ధరకే అద్భుతమైన శుభ్రతను అందించే నిర్మా వాషింగ్ పౌడర్ వేగంగా ఎంతో ప్రజాదరణ పొందింది. అప్పట్లో ప్రముఖ డిటర్జెంట్ సర్ఫ్ కిలోకి రూ.15కి అమ్ముడవుతుండగా, నిర్మ సర్ఫ్ మాత్రం కేవలం రూ.3.50కే లభించేది. దింతో ధరలో ఉన్న తేడానే నిర్మను గొప్ప విజయానికి నడిపించింది. ఆ సమయంలో మార్కెట్లో ఉన్న అన్ని డిటర్జెంట్లను ఓడించి నిర్మా ఒక పెద్ద పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది. మార్కెటింగ్ వ్యూహంలో చేర్చిన “వాషింగ్ పౌడర్ నిర్మా” పాటను భారతదేశం మొత్తం పాడింది. ఇంకా ఈ డిటర్జెంట్ అన్ని కుటుంబాలను చేరుకుంది అలాగే సామాన్యుల జీవితాల్లో గుర్తుందిపోయే ఉనికిని ఏర్పరచుకుంది.

అప్పట్లో, గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ ప్రజలు ఎక్కువగా బట్టలు ఉతకడానికి పసుపు రంగు సబ్బు బార్లను ఉపయోగించేవారు. మరకలను తొలగించడంలో పరిమితులు ఉన్న ఈ ఉత్పత్తులను అధిగమించడం ద్వారా నిర్మా అపారమైన ప్రజాదరణ పొందింది. కర్సన్ భాయ్ తన సైకిల్‌పై ఇంటింటికీ తీరుగుతూ నిర్మ సర్ఫ్ అమ్ముతుండేవాడు. కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకునే ఈ పద్ధతి నిర్మా విజయాన్ని పరుగులు పెట్టించింది. ఇలా డిమాండ్ పెరగడంతో కర్సన్ భాయ్ అహ్మదాబాద్‌లో ఒక చిన్న తయారీ యూనిట్‌ను ప్రారంభించి నిర్మా ఉత్పత్తిని విస్తరించారు. 1980లలో నిర్మ జింగిల్ “వాషింగ్ పౌడర్ నిర్మ” భారతీయ ప్రకటనల ప్రపంచాన్ని తుఫానుగా మార్చింది. ఈ కాలంలో నిర్మా భారతీయ డిటర్జెంట్ మార్కెట్‌లో 60% వాటాను సొంతం చేసుకుంది.

నిర్మా వేగవంతమైన వృద్ధి HLL (ఇప్పుడు HUL) తో సహా పెద్ద కంపెనీలను ఆందోళనకు గురిచేసింది. కఠినమైన మార్కెట్ పరిశోధన ద్వారా HLL నిర్మా బలహీనతలను గుర్తించారు. నిర్మా వాడేవారి చేతులకు అలెర్జీలు, బట్టలలో సువాసన లేకపోవడం వంటి కారణాల వల్ల HLL కొత్త మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించింది. కస్టమర్ల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా 1988లో “వీల్” అనే కొత్త డిటర్జెంట్‌ను ప్రవేశపెట్టిన HLL, నిర్మా మార్కెట్ ఆధిపత్యాన్ని బ్రేక్ చేసేందుకు చురుకుగా పనిచేసింది.

చివరికి నిర్మా సోడా యాష్ తయారీ ఇంకా సిమెంట్ వంటి రంగాలలోకి విస్తరించినప్పటికీ ఒకప్పుడు దాని విజయానికి మూలస్తంభంగా ఉన్న డిటర్జెంట్ వ్యాపారం గణనీయంగా క్షీణించింది. గత విజయాలతో సంబంధం లేకుండా వ్యాపారంలో స్తబ్దత పతనానికి దారితీస్తుందనే కీలకమైన పాఠాన్ని నిర్మా కథ నొక్కి చెబుతుంది. నిర్మా బాతింగ్ సోప్ ఇంకా హెయిర్ ఆయిల్ వంటి ఇతర ఉత్పత్తి వర్గాలలోకి కూడా ప్రవేశించింది, కానీ బ్రాండ్ మసకబారిన ఇమేజ్ కారణంగా ఈ ప్రయత్నాలు పరిమిత విజయాన్ని సాధించాయి.

2017 నాటికి నిర్మా మార్కెట్ వాటా 4%కి పడిపోయింది. దాదాపు అదే సమయంలో ఘాడి డిటర్జెంట్ పౌడర్ నిర్మాకి మరొక పోటీదారి ఉద్భవించింది. కాన్పూర్‌కు చెందిన ఇద్దరు సోదరులు ప్రారంభించిన ఘాడి కొంచెం ఎక్కువ ధరకు మెరుగైన నాణ్యత అందించింది, కేవలం బడ్జెట్ ధర కంటే విలువను కోరుకునే అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి ప్రజలను ఆకర్షించింది. ఘాడి మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ప్రజలని త్వరగా ఆకర్షించడానికి ఉపయోగపడింది, దింతో నిర్మా మార్కెట్ వాటాని మరింత క్షీణింపజేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.