గణేశుడి ఆలయాలు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నాయి. అయితే ఏ అలయంలోనైనా సరే గణపయ్య రూపం ఏనుగు తల మానవ శరీరంతో ఉండటం చూస్తాం. అయితే ఒకే ఒక గణపతి ఆలయంలో మాత్రం గణపయ్య మానవ రూపంలో దర్శనం ఇస్తాడు. ఆ ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఆది వినాయక ఆలయంలో నరుడిగా గణపయ్య దర్శనం ఇస్తాడు. దీంతో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గణపయ్యను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రజలు కూడా ఈ ఆలయంలో పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం శివుడు కోపంతో బాలుడి శరీరం నుండి తలను వేరు చేశాడు. దీని తరువాత వినాయకుడికి ఏనుగు ముఖంతో జీవం పోశాడు. అప్పటి నుండి ప్రతి ఆలయంలో ఈ గజాననుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే తమిళనాడులోని తిరువారూరు ఆది వినాయక ఆలయంలో గణపతి ముఖం మనిషిలా దర్శనం ఇస్తుంది. దీనికి కారణం శివుడు పార్వతి దేవి ప్రాణం పోసిన బాలుడి ముఖం శివుడు వేరు చేయక ముందరది అని స్థల పురాణం చెబుతుంది. ఈ కారణంగా గణపతి నరుడి రూపంలోనే ఇక్కడ పూజింపబడుతున్నాడు.