బంగారానికి.. భారతీయ మహిళలకు మధ్య బలమైన బంధముంది. అది మాటల్లో చెప్పలేనిది. మూటల్లో కొలవలేనిది. ఆదా కోసం అనుకోండి.. ఆదాయం కోసం అనుకోండి.. భవిష్యత్ పెట్టుబడిగా అయినా అనుకోండి..
పుత్తడిని కొనాల్సిందే అంటారు. డిజిటల్ గోల్డ్ వచ్చిన తరువాత వేలకు వేలు చేతిలో లేకపోయినా ఓ 500 రూపాయిలు ఉన్నా గోల్డ్ కొనే ఛాన్స్ వచ్చేసింది. ఇక ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ను ఎప్పుడైతే అందుబాటులోకి తెచ్చిందో.. దీనికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇది సక్సెస్ కావడంతో.. ఇప్పుడు అందరి చూపూ దీనిపైనే పడింది.
బంగారం కొని ఇంట్లో పెట్టుకోలేరు. అలాగని లాకర్లలో దాచేంత గోల్డ్ ను ఎక్కువమంది కొనలేరు. కొంతమందికి అసలు బంగారం నగలను ధరించడమే ఇష్టముండదు. అలాంటివారందరికీ ది బెస్ట్ ఆప్షన్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. ప్రస్తుతం ఇది ఓపెన్ అయి ఉంది. ఫిబ్రవరి 16 తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఇది నాలుగో సిరీస్. ఆర్బీఐ చెప్పిన ప్రకారం చూస్తే.. ఒక గ్రాము గోల్డ్ రేటు 6 వేల 263 రూపాయిలు. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో కొంటే.. గ్రాముకు 50 రూపాయిలు డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంటే అప్పుడు ఒక గ్రాము 6 వేల 213 రూపాయిలకే వస్తుంది.
ఈ స్కీమ్ లో కనీసం ఒక్క గ్రాము బంగారమైనా కొనాలి. అలాగే ఒకే ఆర్థిక సంవత్సరంలో నాలుగు కేజీల వరకు కొనవచ్చు. అది కూడా వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకే ఈ అవకాశం ఉంటుంది. అదే ట్రస్టులైతే 20 కేజీల వరకు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది. 8 ఏళ్ల కాలానికి ఈ స్కీమ్ కింద గోల్డ్ బాండ్ ను జారీచేస్తారు. ఈ టైమ్ పూర్తయ్యాక.. అప్పటి రేటును మీకు చెల్లిస్తారు. బంగారం ధర పెరిగేదే కాని.. తగ్గడం కష్టమని నిపుణులు అంటున్నారు. ఒకవేళ తగ్గినా అదీ స్వల్పంగానే ఉంటుంది. ఆ రకంగా చూసినా ఈ స్కీమ్ మంచిదే. ఒకవేళ మధ్యలో ఈ బాండ్లు వద్దు అనుకుంటే.. 5 ఏళ్ల తరువాత క్యాష్ చేసుకోవచ్చు. ఈ బాండ్స్ కొంటే ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటంటే.. జీఎస్టీ అస్సలు ఉండదు. మేకింగ్ ఛార్జీలు ఉండవు. వీటితోపాటు ఇతర ఛార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
మరి ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను ఎక్కడ ఎలా కొనాలో చూస్తే.. NSE, BSE….. ఈ స్టాక్ ఎక్స్ ఛేంజీలు, పోస్టాఫీసులు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు.. ఇలా కొన్ని సంస్థల నుంచి కొనుగోలుకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు బాండ్లను కేటాయించినప్పటి నుంచి వడ్డీ ఉంటుంది. ఈ ఇంట్రస్ట్ మరీ ఎక్కువగా ఏమీ ఉండదు. కేవలం 2.5 శాతం మాత్రమే ఉంటుంది. దీనిని ఆరు మాసాలకు ఓసారి ఇస్తారు. షాపులో బంగారం కొంటే.. దానిని ఎక్కడ దాయాలన్నది పెద్ద టెన్షన్. దొంగల భయం వెంటాడుతుంది. ఈ బాండ్లకు అలాంటి బాధ ఉండదు.
ఆన్ లైన్ ద్వారా కొనాలంటే.. నెట్ బ్యాంకింగ్ కు వెళ్లి లాగిన్ అయ్యాక.. మెనూలోని ఈ-సర్వీసెస్ లో ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్ ఉంటుంది. అందులో సావరిన్ గోల్డ్ బాండ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. తరువాత అక్కడున్న ప్రొసీజర్ ను ఫాలో అయ్యి.. ఈ బాండ్లను కొనవచ్చు. అలాగే బ్యాంకు లేదా సెలక్ట్ చేసిన పోస్టాఫీస్ కు వెళ్లి, ఎంత బంగారం కావాలో వంటి వివరాలను నింపిన అప్లికేషన్ ను ఇవ్వాలి. మీరు చెల్లించాల్సిన మొత్తానికి సరిపడా డీడీని తీసి ఇవ్వాలి. దీంతోపాటు మీ ఆధార్, పాన్ కాపీలను వారికి ఇవ్వాలి. ఆల్రెడీ షేర్ మార్కెట్ లో ఉన్నవారు స్టాక్ ఎక్స్ ఛేంజీల ద్వారా కొనవచ్చు. ఈ బాండ్ల కాలవ్యవధి 8 ఏళ్లకన్నా ముందే మీకు డబ్బు అవసరమైతే.. వీటిని క్యాష్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని పన్నులు వర్తిస్తాయని మర్చిపోవద్దు. సో ఏ రకంగా చూసినా సావరిన్ గోల్డ్ బాండ్ల వల్ల లాభాలే ఎక్కువని చెప్పచ్చు.