AP Gold Mining :కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సంపద అన్నట్లు.. ఏపీ నేలలు దాగి ఉన్న స్వర్ణం గుట్టు వెల్లడైంది. వేలు, లక్షల కోట్ల ముడి బంగారం.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఆ తళతళలు మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రాన్ని సుసంపన్నం చేయనున్నాయి. ఈ మేరకు అధికారులు శరవేగంగా బంగారు గనుల తవ్వకానికి కసరత్తులు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. స్థానిక గ్రామాల్లో ప్రజాభిప్రాయ స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసలే బంగారు, ఇన్నాళ్లు తాము నడిచిన భూమిలోనే ఉందన్న తెలిసిన అక్కడి ప్రజల డిమాండ్లు ఎలా ఉండనున్నాయి, ప్రభుత్వ కార్యచరణ ఎలా ఉండనుండననేది ఆసక్తిగా మారింది.
ఏపీలో కొన్ని జిల్లాల్లో వివిధ అరుదైన, ఖరీదైన గనిజాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు. వీటిని వెలికి తీస్తే.. లక్షల కోట్ల సంపద రాష్ట్రాని, దేశానికి సమకూరుతుందని అంచనాలు వేశారు. వాటిలో భాగంగానే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో… దేశంలోనే తొలిసారి ప్రైవేట్ భాగస్వామ్యంలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్రాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. దీంతో.. ఇక్కడ బంగారం ప్రాసెస్ చేసే పరిశ్రమ ఏర్పాటు ఆగమేఘాల మీద చేసేందుకు ప్రైవేట్ సంస్ధలు ఆసక్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంబంధిత ప్రాంతంలో ఫిబ్రవరి 18న ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రైవేటు రంగంలో ఏర్పడనున్న తొలి బంగారం గని ఇదే కాగా.. ఈ ప్రాజెక్టును దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అనే కంపెనీ దక్కించుకుంది. ఈ సంస్థ దాని అనుబంధ సంస్థ అయిన జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జొన్నగిరి బంగారం గని వద్ద మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకో.. కొంత ప్రభుత్వ భూమిని అప్పగించగా, మరికొంత ప్రైవేట్ భూముల్ని సంస్థ సేకరించింది. ఇప్పటికే.. ఈ ప్రాసెసింగ్ యూనిట్ పై సంస్థ రూ.350 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టగా.. పని ప్రారంభించిన తర్వాత ఏడాదికి దాదాపు 750 కిలోల కంటే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి రెండు దశాబ్థాల కిందట అంటే.. 1994లోనే కర్నూలు జిల్లా గోల్డ్ నిల్వలు ఉన్నట్లుగా తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల్లో తేలింది. ఇక్కడి దాదాపు 1500 ఎకరాల్లో పసిడి నిల్వలు ఉన్నట్లు అనేక నివేదికల్లో వెల్లడైంది. దీంతో.. ఈ సంపదను వెలికి తీసేందుకు.. ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికారు. ఆ తర్వాత 2005లో ఓపెన్ లైసెన్సింగ్ విధానంతో మైనింగ్ లీజు ప్రక్రియను సరళీకరించింది. ఆ నిబంధనల మేరకు.. విదేశీ పెట్టుబడులతో పాటుగా ప్రైవేట్ సంస్థల పెట్టుబడుల కోసం ప్రభుత్వాలు ఎదురుచూశాయి.
బెంగళూరుకు చెందిన ఈ ప్రైవేట్ సంస్థ.. 2013లోనే జొన్నగిరి మండలంలో బంగారాన్ని కనుక్కునేందుకు ట్రయల్స్ ప్రారంభించేందుకు ప్రైమరీ లైసెన్స్‌ను పొందింది. ఆ తర్వా పైలట్ ప్రాజెక్ట్ కోసం మరిన్ని అనుమతులు అవసరం కాగా.. అందుకోసం దాదాపు దశాబ్దానికి పైగా సమయం పట్టింది. అలా.. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని చివరికి 2021లో బంగారు మైనింగ్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 30 వేల బోర్ వెల్స్ వేసి.. ట్రయల్స్ నిర్వహించిన సంస్థ.. మరికొన్నాళ్లలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్న సంస్థ.. జోన్నగిరిలో దాదాపు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టి వివిధ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సైతం తన తరఫున చేయాల్సిన పనుల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆయా గ్రామాల్లోని ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తైన తర్వాత.. ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టనున్నారు. ఈ మైనింగ్ కోసం సంస్థకు 25 ఏళ్లకు లీజు మంజూరు చేయనున్నారు.
ఇంకెక్కడ పసిడి ఉందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుతో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్నిచోట్ల బంగారం గనులను అధికారులు గుర్తించారు. వాటిని అభివృద్ధి చేసి అక్కడి నుంచి పసిడిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్ ఆసక్తిగా ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉన్న విలువైన ఖనిజ సంపదను వెలికి తీసే అవకాశం తమకు ఇవ్వాలని.. ఎన్‌ఎండీసీ లిమిటెడ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందంటున్న అధికారులు.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గుర్తించిన ఖనిజ సంపదను వెలికి తీస్తే.. రాష్ట్రం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని, అద్భుత ప్రగతికి దారులు పడతాయంటున్నారు.