Gold Price: బంగారం ధరలు చుక్కలు చూయిస్తున్నాయి. రికార్డ్ గరిష్ఠాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.70 వేలు దాటింది. మరి ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా? బంగారం ధర ఎప్పుడు తగ్గొచ్చు? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Gold Price: బంగారం ధరలు రోజు రోజు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో తులం బంగారం రూ. 1300 పైన పెరిగింది. ప్రస్తుతం గ్రాము గోల్డ్ రేటు 7 వేల పైనే ఉంది. మరి ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా? బంగారాన్ని నగల రూపంలో కొంటే బెటరా లేదా బాండ్స్ రూపంలో కొనడం మంచిదా? బంగారం ధరలు పెరిగేందుకు కారణాలేంటి, ఈ పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ధరలు తగ్గే వరకు వేచి చూడడం మంచిదేనా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధర పెరగుదలతో పోలిస్తే.. తగ్గడం చాలా స్వల్పంగా ఉంది. ఆర్థిక అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకుల వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని భద్రమైన సాధనంగా భావిస్తున్నారు. గోల్డ్ రేట్ల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలుఉంటాయి. ప్రపంచ ప్రధాన మార్కెట్లలో లండన్ బులియన్ మార్కెట్ ఒకటి. ధరలను నిర్ణయించేది ఈ మార్కెట్టే. పెద్ద పెద్ద మైనింగ్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు ఈ సంస్థలో ఉన్నారు. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 2,256 డాలర్ల స్థాయిలో ట్రేడింగ్ అవుతోంది. 2023 నాటి గరిష్ఠ ధరతో పోలిస్తే 8 శాతం ఎక్కువ. భారత కరెన్సీ విలువ సైతం పడిపోవడం గోల్డ్ ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. ప్రతి ఏడాది భారత్ కు 800 టన్నుల బంగారం దిగుమతి అవుతుంటుంది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ధరల పెరుగుదలకు మరో కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గత 20 ఏళ్ల కాలాన్ని గమనించినట్లయితే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. దీనికి కారణం దాని డిమాండ్ పెరగడమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, ఎన్నికల వాతావరణం, డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు, రాజకీయ పరమైన మార్పులు సైతం బంగారం పెరిగేందుకు కారణమవుతున్నాయి.
బంగారం ధర ఎప్పుడు తగ్గొచ్చు?
బంగారం ధరల పెరుగుదల 2025 వరకు కొనసాగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ ఏడాదంతా ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయని అర్థమవుతోంది. వచ్చే ఏడాదిలో కాస్త ఊరట లభించవచ్చు.
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న క్రమంలో పసిడిపై పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నగలు లేదా బంగారు నాణాలు కొనుగోలు చేస్తే మొత్తం ధరలో తరుగు కమిషన్ కింద 20 శాతం పోతుంది. అంటే మీరు రూ.100 పెట్టి బంగారం కొంటే దాని అసలు విలువ రూ.80 మాత్రమే. అదే గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే నెల నెలా వడ్డీ వస్తుంది. బాండ్స్ పోతాయనే భయం ఉండదు. డిజిటల్ గోల్డ్ ద్వారా 4 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. వాటిపై పన్ను మినహాయింపులు సైతం లభిస్తాయి.