Gold Scheme | పసిడి కాంతులను ఇష్టపడని కాంతలు ఎవరూ ఉండరు! అందుకే, పుత్తడిపై అతివల వలపును తమ గెలుపు సూత్రంగా ఎంచుకుంటున్నారు ఆభరణాల తయారీదారులు.
గోల్డ్ స్కీమ్స్ పేరిట వాయిదాల పద్ధతిలో సొమ్ము తీసుకొని.. వాళ్లకు నచ్చిన సొమ్ములు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
Gold Scheme | పసిడి కాంతులను ఇష్టపడని కాంతలు ఎవరూ ఉండరు! అందుకే, పుత్తడిపై అతివల వలపును తమ గెలుపు సూత్రంగా ఎంచుకుంటున్నారు ఆభరణాల తయారీదారులు. గోల్డ్ స్కీమ్స్ పేరిట వాయిదాల పద్ధతిలో సొమ్ము తీసుకొని.. వాళ్లకు నచ్చిన సొమ్ములు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తరుగు లేదు, మజూరీ లేదన్న ప్రచారం ఈ స్కీమ్స్ ఆదరణకు కారణమవుతున్నది. ఇంతకీ వాయిదాల పథకం మంచిదేనా? దీనిని ఎంచుకోవడం వల్ల అదనంగా కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా? తెలుసుకుందాం..
మీశ్రీవారి పుట్టిన రోజుకు బహుమతిగా బ్రేస్‌లెట్ ఇచ్చి షాక్ ఇవ్వాలనుకుంటున్నారా? పెండ్లిరోజు సందర్భంగా మీ శ్రీమతి రవ్వల గాజుల ముచ్చట తీర్చాలని భావిస్తున్నారా? ‘అనుకున్నామని జరగవు కొన్ని..’ అని నిర్లిప్తత వద్దు. గోల్డ్ స్కీమ్‌లో చేరితే ‘అనుకోకున్నా ఆగవు కొన్ని’! సాధారణ బంగారం దుకాణాలు మొదలుకొని పేరుమోసిన జువెలరీ షోరూమ్‌ల వరకు ఈ పథకాన్ని నిర్వహిస్తున్నాయి. మరి వీటిని నమ్మొచ్చా? అని సందేహం రావచ్చు. సెక్షన్ 73 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం.. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వినియోగదారుల నుంచి ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో డబ్బులు వసూలు చేసి.. దానికి తగ్గ వస్తువులు గానీ, సేవలు గానీ అందించే వెసులుబాటు ఉంది. వీటిని 11 నెలలు పూర్తయ్యేలోపు ఇవ్వాలి. ఏడాది కావొద్దన్నమాట! అందుకే గోల్డ్ స్కీమ్స్ అన్నీ 11 నెలల కాలపరిమితితో ఉంటాయి. చట్టబద్ధత ఉన్నంత మాత్రాన భద్రత ఉందనుకుంటే పొరపాటు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ప్రమాదం చేయడన్న గ్యారెంటీ లేదు కదా! ఇది కూడా అంతే!!
20 శాతం అదనపు లబ్ధి
గోల్డ్ స్కీమ్‌లో నెలవారీ చెల్లింపులతో ఇటు వినియోగదారుడికి, అటు దుకాణాదారుకు ఇద్దరికీ ప్రయోజనమే! ఒకేసారి రెండు తులాల నగ చేయించుకోవాలంటే రమారమి రూ.1.20 లక్షలు అవుతుంది. ఈ మొత్తాన్ని నెలకు రూ.11వేల చొప్పున 11 నెలలు వాయిదాలు చెల్లిస్తే తరుగు, మజూరీ ఉండదు కాబట్టి రూ.1.21 లక్షలతో రెండు తులాల కన్నా ఎక్కువ బరువుండే ఆభరణం సొంతం చేసుకోవచ్చు. తరుగు, మజూరీ మినహాయింపు వల్ల కనీసం 11 శాతం వరకు రిటర్న్ పొందినట్టు అవుతుంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ లబ్ధి దాదాపు 20 శాతం వరకు ఉంటుంది. స్కీమ్‌లో వాయిదా చెల్లించిన రోజు ఉన్న ధరను బట్టి ఎంత బంగారం వస్తుందో లెక్కకడతారు. ఇక, వాయిదాలు మొదలుపెట్టిన మూడు నెలలకు బంగారం ధర తగ్గిందే అనుకోండి, తర్వాతి పద్దు చెల్లించేటప్పుడు అంతే మొత్తానికి ఎక్కువ బంగారం వస్తుంది కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు. ధర పెరిగిందే అనుకోండి, ముందు నెలల్లో పొందిన బంగారం విలువ కూడా పెరుగుతుంది కాబట్టి.. సమస్య లేదు.
రొటేషన్‌తో లాభం
తరుగు, మజూరీ భారం తగ్గించడమే కాదు ఈ స్కీమ్‌ను ఎంచుకున్నవారికి మరిన్ని ప్రయోజనాలు ఇస్తుంటాయి పలు జువెలరీ సంస్థలు. వినియోగదారులకు ఇంత లాభం చేకూరితే, తయారీదారులకు నష్టం వాటిల్లదా? అన్న అనుమానం సహజం. వినియోగదారులు చెల్లించిన వాయిదాలను దుకాణాదారులు తమ వ్యాపారంలో పెట్టుబడిగా వాడుకుంటారు. పదకొండు నెలల కాలపరిమితిలో ప్రతినెలా సమకూరే మొత్తంతో బంగారం కొనుగోలు చేసి, ఆభరణాల రూపంలో విక్రయిస్తుంటారు. ఆ క్రమంలో లాభాలు గడిస్తారు. ఆ లాభాలను మళ్లీ పెట్టుబడిగా మలుస్తారు. ఇలా కస్టమర్లు చెల్లించే వాయిదాలు రొటేషన్ అవుతూనే ఉంటాయి. అలా వచ్చే లాభాల్లోంచి ఎంతోకొంత వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటారు.
రిస్క్ తగ్గించుకోండి
‘చక్కని స్కీమ్ ఉంది కదా!’ అని వచ్చిన జీతంలో సింహభాగం దానికే కట్టేసి రిస్క్ కొనితెచ్చుకోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దల మాట. స్కీమ్‌లో చెల్లించే మొత్తం నెల జీతంలో పది శాతం మించకూడదు. నాలుగు నెలల తర్వాత దుకాణాదారు బోర్డు తిప్పేసినా భారీగా నష్టపోయే పరిస్థితి రాదు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిపని. అయితే, మీరు ఎంచుకునే ఆభరణం విషయంలో క్లారిటీ ఉండాలి. మీ ఇష్టాల కన్నా.. అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగల ఎంపిక ఉండాలి. ఆడపిల్లలు ఉన్నట్టయితే వారు పెండ్లీడుకు వచ్చేసరికి పది తులాల నగలైనా సమకూర్చుకోవాలి.
ఎంపిక మీదే
గోల్డ్ స్కీమ్స్ ఎంచుకునే క్రమంలో ఆఫర్ల కన్నా డిజైన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ దుకాణంలో వెరైటీ డిజైన్లు ఉంటాయో అక్కడే స్కీమ్‌లో జాయిన్ అవ్వాలి. అంతేకానీ, రూ.10 వేల వరకు కలిసొస్తుందని మామూలు ఆభరణాలు అమ్మేచోట ఎంత మంచి స్కీమ్‌లో చేరినా ప్రయోజనం ఉండదు. మీరు కొనుగోలు చేసే ఆభరణం మనసుకు నచ్చేదై ఉండాలి. అందుకనే ముందుగానే, నాలుగైదు జువెలరీ దుకాణాలకు వెళ్లి, మార్కెట్‌లో వాటి స్థితిగతులు పరిశీలించాలి. మీరు ఏ నగ కొనాలో అంచనాకు వచ్చి అందుకు తగ్గట్టుగా ఇన్‌స్టాల్‌మెంట్ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే? డబ్బు ఎవరికీ ఊరికే రాదు! బంగారంపై మోజు ఎప్పటికీ తీరదు!!
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in