నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్?

www.mannamweb.com


DSC Notification : : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీచర్ల నియామకాలపై దృష్టిసారించిన ప్రభుత్వం..
త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. 6 వేల నుంచి 10వేల పోస్టులతో, వారంరోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో డీఎస్సీపై కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరించారు. కాగా విద్యాశాఖలో 18,500 పోస్టులు ఉన్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీలో కొన్నేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే, గత పదిరోజుల క్రితం డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ట్విటర్ వేదికగా డీఎస్సీ నోటిఫికేషన్ పై వివరాలను బొత్స వెల్లడించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్న వారందరికీ సంక్రాంతి తరువాత శుభవార్త తెలియజేస్తామని బొత్స చెప్పారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని, ఏఏ జిల్లాలకు ఎన్ని పోస్టులు, తదితర అంశాలను పండుగ అనంతరం వెల్లడిస్తామని బొత్స ట్వీట్ లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ ముగియడంతో తాజాగా బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో భేటీ కావడం, జిల్లాల వారీగా ఖాళీలను సేకరించడంతో త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.