జగన్‌తో ప్రమాణం చేయించడంపై స్పందించిన గోరంట్ల బుచ్చయ్య

Gorantla Butchaiah Chowdary: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రుల ప్రమాణ స్వీకారం, శాఖల కేటాయింపు చకచకా పూర్తయ్యాయి.


చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. పాలనను పరుగులెత్తించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అయిదు గ్యారంటీలపై సంతకాలూ చేశారు.

ఇక ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు.

దీనిపై ఆయన స్పందించారు. ప్రొటెం స్పీకర్ పెద్ద పోస్టేమీ కాదని అన్నారు. ఏదో రెండు రోజుల పాటు కొత్త సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయిస్తే అయిపోతుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిని కావడం వల్ల ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు తనను కోరారని, దీనికి అంగీకరించానని చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంపై గోరంట్ల బుచ్చయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒకటేనని, అందరినీ సమానంగా చూస్తామని అన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులను సమానంగా గౌరవస్తామని చెప్పారు.

అలా అందరినీ సమానంగా చూడటం, గౌరవంగా వ్యవహరించడం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రభుత్వం వల్ల కాలేదని గోరంట్ల విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో శాసన సభ సజావుగా సాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ చక్కటి వేదిక అవుతుందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం.. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, మైకులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని గోరంట్ల అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం లేదని, ఉన్నవాళ్లయినా సక్రమంగా సభకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ సభ్యులు నిర్మాణాత్మక విమర్శలు చేయవచ్చని, వాటిని స్వీకరిస్తామని అన్నారు.