టీచర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఇకపై సర్వీస్ టీచర్లు సైతం టెట్ క్వాలిఫై కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం శుక్రవారం జారీ చేయనుంది. దీంతో ఇకపై టీచర్లు సర్వీస్‌లో ఉండాలన్నా.. ప్రమోషన్లు పొందాలన్నా టెట్ క్వాలిఫై తప్పనిసరి అని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెట్ నిబంధనలను తెలంగాణ విద్యా శాఖ సవరణ చేసింది. 2009 తర్వాత నియమితులైన 30 వేల మంది టీచర్లకు ఈ నిబంధన వర్తించనుంది. రానున్న రెండేళ్లలో సర్వీసులో ఉన్న టీచర్లంతా ఈ టెట్ పాస్ కావాల్సిందేనన్నది సుస్పష్టం.
మరోవైపు.. టెట్ నోటిఫికేషన్‌ను గురువారం తెలంగాణ విద్యా శాఖ విడుదల చేసింది. నవంబర్ 15వ తేదీ నుంచి ఈ దరఖాస్తులను అభ్యర్థుల నుండి స్వీకరిస్తారు. నవంబర్ 29వ తేదీతో ఈ దరఖాస్తులు స్వీకరణ ముగియనుంది. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. కాగా.. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్ గత జూన్‌లో ప్రభుత్వం విడుదల చేసింది.
ఇప్పటికే ఈ పరీక్షల ఫలితాలు.. జులై 22న వెల్లడయ్యాయి. తాజాగా గురువారం రెండో విడత టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులంతా ఈ టెట్‌లో అర్హత సాధించాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లంతా ఈ పరీక్ష పాస్ కావాల్సి ఉంది.
































