రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్న బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు, ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావలసి ఉంటుందని ఇందులో పేర్కొంది.
ఏపీలో ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ నిబంధనలు 2025 నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఫౌండేషన్, ప్రైమరీ స్కూళ్ల నుంచి హైస్కూల్ వరకు జెడ్పీ, మున్సిపల్ స్కూళ్లలోని ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు ఇచ్చింది. గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లు ఇతర కేడర్ బదిలీల్లో హేతుబద్ధీకరణ కోసం మార్గదర్శకాలతో కూడిన నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతీ విద్యా సంవత్సరంలో మే 31 తేదీ నాటికి సదరు పాఠశాలలో 5 ఏళ్ల సర్వీసు పూర్తి అయిన గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, 8 ఏళ్ల సర్వీసు పూర్తి అయిన ఉపాధ్యాయులకు బదిలీ వర్తించనుంది.
కేటగిరి -1కి ఒక పాయింట్, కేటగిరి-2కి రెండు పాయింట్లు, కేటగిరి-3కి మూడు పాయింట్లు, కేటగిరి-4కి ఐదు పాయింట్లు, ఐదు స్టేషన్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సర్వీస్ పాయింట్లు ఏడాదికి 0.5గా పేర్కొంది. మే 31 నాటికి ఖాళీలు, పదవీ విరమణ చేసే స్థానాలు, హేతుబద్ధీకరణ ఖాళీలు, తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు, ఏడాదికిపైగా గైర్హాజరైన టీచర్ల ఖాళీలు, స్టడీ లీవ్ ఖాళీలను చూపించనున్నట్లు ప్రభుత్వం వివరించింది.
చాలా రోజులుగా టీచర్ల బదిలీలకు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులకు మే నెలలో బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోందని అధికారులు ముందుగానే తెలిపిన సంగతి విదితమే. వారి బదిలీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మొదటిసారి ఈ చట్టం ప్రకారం బదిలీలు చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు.

































