ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే.. ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే వారు టీకి బదులుగా గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు.
బరువు తగ్గడం కోసం కొందరు గ్రీన్ టీ తాగుతున్నారు. వాస్తవానికి గ్రీన్ టీ తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. దీంతో చర్మంలో గ్లో పెరుగుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. గ్రీన్ టీ వల్ల కలిగే ఇన్ని ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత చాలామంది గ్రీన్ టీని ఎక్కువగా తాగడం మొదలుపెట్టారు. ఆఫీసులో ఉన్నవారు రోజుకు చాలాసార్లు గ్రీన్ టీ తాగుతారు. కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతుంటారు. ఈ విధంగా, గ్రీన్ టీ తాగడం వల్ల ప్రయోజనం కాకుండా హాని కలిగిస్తుంది. గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి, ఎలాంటి వారు దానికి దూరంగా ఉండాలి.? అనే విషయాలను ఎప్పుడు తెలుసుకుందాం..
గ్రీన్ టీ ఇలా తాగడం వల్ల ప్రయోజనం కంటే హాని కలుగుతుంది..
ఖాళీ కడుపుతో తాగకండి: కొంతమంది తమ రోజును గ్రీన్ టీతో ప్రారంభిస్తారు. ఇది హాని కలిగిస్తుంది. ఎప్పుడూ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగకండి. ఇది ఎసిడిటీ సమస్యకు కారణం అవుతుంది. ముందుగా ఏదైనా తినండి.. అనంతరం 1 గంట తర్వాత గ్రీన్ టీ తాగండి.
ఎక్కువ గ్రీన్ టీతో హాని: బరువు తగ్గాలనే లక్ష్యంతో ప్రజలు గ్రీన్ టీని రోజుకు చాలాసార్లు తాగుతారు. అయితే 1 కప్పు గ్రీన్ టీలో 24-25 మి.గ్రా కెఫిన్ ఉంటుంది. రోజుకు 4-5 కప్పుల గ్రీన్ టీ తాగితే, అది శరీరంలో కెఫిన్ స్థాయి మొత్తాన్ని పెంచుతుంది. ఇది ఆందోళన-భయం, గుండెల్లో మంట, తల తిరగడం, మధుమేహం, నిద్రలేమికి దారితీస్తుంది.
ఆహారంతో పాటు గ్రీన్ టీని తాగవద్దు: కొంతమంది ఆహారంతో పాటు లేదా ఆహారం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగుతారు. ఇలా చేస్తే హాని కలుగుతుంది. తిన్న వెంటనే కొంత గ్యాప్ (40 నిమిషాల నుంచి ఒక గంట) తీసుకోని గ్రీన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. దీని కారణంగా శరీరం ఐరన్‌ను సరిగ్గా గ్రహించదు. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. కావున ఆహారం తిన్న తర్వాత గ్రీన్ టీని తాగకూడదు.
మందులతో గ్రీన్ టీ తాగొద్దు: ఏదైనా సమస్యకు మందులు తీసుకుంటే వాటితో గ్రీన్ టీ తాగవద్దు. ముఖ్యంగా నాడీ వ్యవస్థకు సంబంధించినవి.. పలు మందులతో గ్రీన్ టీ తీసుకోవడం మానేయాలి. మందులతో కలిపి గ్రీన్ టీ తాగడం హాని కలిగించవచ్చు.
గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగవద్దు: గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగకూడదు. ఇది కాకుండా, తల్లులు కూడా దీనికి దూరంగా ఉండాలి. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ పాల ద్వారా పిల్లల శరీరంలోకి చేరుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
గ్రీన్ టీ త్రాగడానికి సరైన మార్గం..
రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీని తాగకూడదు. భోజనం చేసిన 1 గంట తర్వాత మాత్రమే గ్రీన్ టీ తాగాలి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మానుకోండి. నిద్రపోయే ముందు గ్రీన్ టీ తాగకూడదు. మీరు 10-11 గంటల మధ్య అల్పాహారం తర్వాత తాగవచ్చు. సాయంత్రం 5-6 గంటలకు గ్రీన్ టీ తీసుకోవచ్చు.