కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కరివేపాకును వంటల్లో ఉపయోగించడం మంచి రుచి వస్తుంది.
కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే కరివేపాకును అస్సలు పారేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది కరివేపాకును జుట్టు పెరగడానికి ఉపయోగిస్తారు. కరివేపాకును కూరల్లో వేయడం కంటే పొడులు, పచ్చళ్లు తయారు చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకుతో చేసే వంటల్లో పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడిని ఎంతో సులభంగా కూడా తయారు చేయవచ్చు. మరి కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేస్తారు? తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
కరివేపాకు, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, తాళింపు దినుసులు, ఆయిల్, చింత పండు, ఇంగువ, శనగ పప్పు, మినప్పప్పు, మెంతులు.
కరివేపాకు పచ్చడి తయారీ విధానం:
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడి పోయేంత వరకు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. ఇవి వేగా ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలను చితక్కొటి వేయాలి. ఇవి వేగాక మెంతులు, కారానికి సరిపడా ఎండు మిర్చి వేసుకుని వేయించాలి. వీటిని పక్కకు తీసుకోవాలి.
ఇందులో కొద్దిగా ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఇవి వేగాక కరివేపాకులను వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక.. మిక్సీ జార్‌లో వేయాలి. ఇందులో నానబెట్టిన చింత పండు కొద్దిగా, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత తాళింపు దినుసులు, ఇంగువ వేసి తాళింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి సిద్ధం.