Warangal: కళ్ల ముందే భర్త, ఇద్దరు పిల్లల దుర్మరణం

వరంగల్ జిల్లాలో సరదా ప్రయాణం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు ఓ కారు ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఓ కుటుంబం మొత్తం గల్లంతయ్యింది. వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ అతని భార్య, కుమార్తె, కుమారునితో కలిసి కారులో వెళ్తున్నారు. సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పింది. దీంతో నేరుగా SRSP కాలువలోకి దూసుకెళ్లింది కారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు.


ఈ ప్రమాదంలో సోమారపు ప్రవీణ్ కుటుంబం మొత్తం గల్లంతైంది. వెంటనే స్పందించిన గ్రామస్థులు.. ప్రవీణ్ భార్య కృష్ణవేణిని ప్రాణాలతో కాపాడారు. కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న కుమారుడిని రక్షించిన హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే కాలువలో గల్లంతైన తండ్రీకూతురు కోసం తీవ్రంగా గాలించగా.. చివరికి తండ్రి ప్రవీణ్, కూతురు హర్షిణి మృతదేహాలను వెలికితీశారు. కారు ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్రామస్థుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు.. ఈ ప్రమాదంతో గాయపడ్డ తల్లి కృష్ణవేణి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. తన కుటుంబం కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లి తల్లడిల్లుతోంది. ప్రాణాలతో బయటపడిన ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోదిస్తోంది. ఓవైపు తన కన్న బిడ్డలు, మరోవైపు భర్త మృతితో ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు అక్కడున్నవారిని కన్నీళ్లు పెట్టిస్తోంది. కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ప్రవీణ్‌కు ఛాతీలో నొప్పి రావడంతోనే.. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ముగ్గురి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.