Inspiration: అప్పుడు కూలి.. ఇప్పుడు రూ.86,000 కోట్లకు అధిపతి

ఓ కూలి వాడు ధనవంతుడు కావడం సినిమాల్లోనే చూస్తుంటాం కదా.. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపకుడు సత్యనారాయణ నువాల్ జీవితం కూడా అలాంటిదే. కష్టానికి, తెలివితేటలకు అదృష్టం కలిసి వస్తే ఎలా ఉంటుందో.. సూర్యనారాయణ నువాల్ జీవితమే ఉదాహరణ. కూలి పనులు చేయడం నుంచి ప్రారంభించి కృషి, పట్టుదలతో వేల కోట్లకు అధిపతిగా మారిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం.


ప్రస్తుత సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపకుడు సత్యనారాయణ్ నువాల్ రాజస్థాన్‌లోని మార్వాడీ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనేమీ వెండి స్పూన్‌తో పుట్టలేదు. తన సొంత కష్టంతో బిలియనీర్‌గా ఎదిగారు. వ్యాపార ప్రపంచంలో ఆయన విజయగాథ లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం.

కుటుంబ బాధ్యతల వల్ల చదువుకు స్వస్తి
సత్యనారాయణ్ నువాల్ రాజస్థాన్‌లోని భిల్వారాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పట్వారీగా పనిచేసేవారు. తాతయ్య కిరాణా దుకాణం నడిపేవారు. 1971లో తండ్రి రిటైర్ అయిన తర్వాత కుటుంబ అవసరాలు తీర్చడానికి సత్యనారాయణ్ నువాల్ 10వ తరగతిలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది.

పెళ్లయ్యాక సిరా అమ్మే వ్యాపారం
సత్యనారాయణ్ నువాల్‌కు 19 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆయనపై మరింత బాధ్యత పెరిగింది. కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఫౌంటెన్ పెన్ను సిరా అమ్మడం ప్రారంభించారు. అయితే ఈ పనిలో అతనికి పెద్దగా ఆదాయం కనిపించలేదు. దీంతో కొంతకాలం పాటు తన గురుదేవులతో కలిసి మథురలో ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించారు. కాని వ్యాపారం చేస్తేనే జీవితంలో ఎదగగలమని గట్టిగా నిశ్చయించుకున్నారు.

అద్దె కట్టలేక స్టేషన్‌లో నిద్ర
సత్యనారాయణ్ నువాల్ జీవనోపాధి కోసం 1977లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని బల్లార్షాకు చేరుకున్నారు. అప్పుడు అద్దెకు ఇల్లు తీసుకునేంత డబ్బులు లేకపోవడంతో చాలా రాత్రులు స్టేషన్‌లో పడుకొనే వారు. ఈ సమయంలోనే ఆయనకు బావులు, గనుల తవ్వకంలో ఉపయోగించే పేలుడు పదార్థాల వ్యాపారం చేసే అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యారు. ఇక్కడి నుంచే ఆయన దశ తిరిగింది.

లోన్, లైసెన్స్ తీసుకొని వ్యాపారం
ఆ రోజుల్లో ఇలాంటి పేలుడు పదార్థాల సరఫరా చాలా తక్కువగా ఉండేది. దీంతో సత్యనారాయణ్ నువాల్ అల్లాభాయ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నెలకు రూ.1000 చెల్లించి అతని నుండి గిడ్డంగి, పేలుడు పదార్థాలు అమ్మే లైసెన్స్ తీసుకుని తన వ్యాపారాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ICI) అధికారులు ఆయనను గుర్తించారు. ఆ తర్వాత ఈ కంపెనీ నువాల్‌ను పర్మనెంట్ పంపిణీదారుగా చేసింది. బొగ్గు గనుల్లో ఉపయోగించేందుకు పేలుడు సామగ్రిని కూడా ఈయన తయారు చేసి అమ్మేవారు. దీంతో మంచి ఆదాయం రావడం ప్రారంభమైంది.

ప్రభుత్వ రంగ సంస్థ వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌తో డీల్
1984లో నువాల్ నాగ్‌పూర్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన ప్రభుత్వ రంగ సంస్థ వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆదాయం రెట్టింపైంది. అయితే డీలర్లు 25 కిలోల పేలుడు పదార్థాలను ఆయన వద్ద రూ.250కి కొనుగోలు చేసి మార్కెట్‌లో రూ.800కి విక్రయించేవారు.

ఎస్‌బీఐ రుణంతో సోలార్ ఇండస్ట్రీ ప్రారంభం
నువాల్ 1995లో ఎస్‌బీఐ నుంచి రూ.60 లక్షల రుణం తీసుకుని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా అనే చిన్న పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. తన పేలుడు పదార్థాలను కోల్ ఇండియా లిమిటెడ్‌కు సరఫరా చేయడం ప్రారంభించారు. ఇక్కడి నుంచి నువాల్‌కు రూ.లక్షల్లో ఆదాయం రావడం ప్రారంభమైంది. ఏడాదిలోపే రూ.1 కోటి పెట్టుబడి పెట్టి ఈ చిన్న ప్లాంట్‌ను పెద్ద తయారీ పవర్‌హౌస్‌గా మార్చారు. 1996లో ఏడాదికి 6000 టన్నుల పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు లైసెన్స్ ఈ కంపెనీ సంపాదించింది.

ఇప్పుడు 50కి పైగా దేశాలకు ఎగుమతి
సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రస్తుతం ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ డ్రోన్‌ల కోసం వార్‌హెడ్‌లు, హ్యాండ్ గ్రెనేడ్‌లు, సైనిక పేలుడు పదార్థాలు, ప్రొపెల్లెంట్‌లు, గ్రెనేడ్‌లు, రాకెట్‌లు, పినాక, అగ్ని వంటి క్షిపణుల కోసం పేలుడు పదార్థాలు తయారు చేసే భారతదేశపు అగ్రగామి కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్‌లో 7,500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి నాగ్‌పూర్‌లో రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. భారతదేశంలోని 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 25 తయారీ ప్లాంట్‌లతో పాటు గాంబియా, నైజీరియా, టర్కీ, దక్షిణాఫ్రికా, ఘనా, ఆస్ట్రేలియా, టాంజానియాలో కూడా ఈ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. ప్రస్తుతం 50కి పైగా దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

సత్యనారాయణ్ నువాల్ ఆస్తుల విలువ 4.3 బిలియన్ డాలర్లు
ఫోర్బ్స్ ప్రకారం సత్యనారాయణ్ నువాల్ ప్రస్తుతం 4.3 బిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.85,843 కోట్లు.