భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో జంప్

సభ్యసమాజం తలదించుకునే ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. కట్టుకున్న భర్త కిడ్నీ అమ్మేసి, వచ్చిన డబ్బుతో ప్రియుడితో లేచిపోయింది ఓ భార్య. ఈ భార్యభర్తలకు పదేళ్ల కూతురు కూడా ఉంది.


హౌరా జిల్లా సంక్రైల్ కు చెందిన ఓ మహిళ ఈ మేరకు తన భర్తను ఒప్పించింది. ఒక కిడ్నీ అమ్మేసినా, మరో కిడ్నీతో బతకొచ్చని, అలా అమ్మగా వచ్చిన డబ్బుతో అమ్మాయిని చదివించుకోవచ్చని, పెళ్లి కూడా చేయొచ్చని భర్తను ఒప్పించింది.

అదే పనిగా సతాయించడంతో భర్త అంగీకరించాడు. దాదాపు ఏడాది పాటు వాళ్లు కిడ్నీ ఆమ్మడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు ఓ పార్టీ దొరికింది. భర్త తన కిడ్నీ అమ్మేశాడు. 10 లక్షల రూపాయలు అందుకున్నాడు. ఇక తన కుటుంబ భవిష్యత్తు బాగుంటుందని భావించాడు.

కానీ భార్య మాత్రం తన భవిష్యత్తును మరొకడితో సెట్ చేసుకుంది. బరాక్ పూర్ కు చెందిన ఓ పెయింటర్, ఫేస్ బుక్ లో ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త కిడ్నీ అమ్మగా వచ్చిన 10 లక్షల రూపాయలు తీసుకొని, అతడితో లేచిపోయింది భార్య.

విషయం గ్రహించిన భర్త లబోదిబోమన్నాడు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అక్కడితో అయిపోలేదు. భార్య ఎక్కడుందో కూడా కనిపెట్టాడు. బరాక్ పూర్ లో ఉంటున్న ఆమె ఇంటికి తల్లిదండ్రులు, కూతుర్ని తీసుకొని మరీ వెళ్లాడు.

భర్తను చూసిన ఆ మహా ఇల్లాలు కనీసం తలుపు కూడా తీయలేదు. పదేళ్ల కూతురు కూడా ఆ మహా తల్లి మనసును కరిగించలేకపోయింది.