రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, టవర్స్, ఖాళీ స్థలాల విక్రయానికి రంగం సిద్ధమవుతోంది.
హైదరాబాద్: రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ – హౌసింగ్ బోర్డు ఫ్లాట్లు, స్థలాలు విక్రయంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు బహిరంగ వేలం వేయాలని హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ సంస్థలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాశ్, హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈనెల 20వ తేదీ నాటికి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయి, పాక్షికంగా పూర్తయిన అపార్ట్ మెంట్ల ఫ్లాట్లతో పాటు, ఓపెన్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నాలుగు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాలు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎటువంటి వివాదాలు లేని భూములు, మంచి అందుబాటులో ఉండే సరసమైన ధరలతో నిర్మించిన అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ కమిషనర్ గౌతం విజ్ఞప్తి చేశారు.
ఈ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఓఆర్ఆర్ పరిసరాలు, ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ పథకాలు చేపట్టాలని భావిస్తున్నారు. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అదికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ స్వగృహకు సంబంధించినంత వరకు గాజులరామారం, పోచారం, ఖమ్మం పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో… ఒక్కో దానిలో సుమారు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లు ఉన్న టవర్ యూనిట్ ఏక మొత్తంగా విక్రయించనున్నారు.