IAS Zainab Sayeed : ఐఏఎస్ అధికారిణి జైనాబ్ సయీద్ సక్సెస్ స్టోరీ.. అత్యధిక మార్కులతో యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన ఘనత ఈమెదే!

IAS Officer Zainab Sayeed : ఏ సక్సెస్ అయినా అంత ఈజీగా రాదు అనేది జగమెరిగిన సత్యం.. ఎంతో ప్రతిష్టాత్మకమైన యూపీఎస్‌సీ సివిల్స్ ఎగ్జామ్ కూడా అంతే..
దీన్ని క్లియర్ చేయడం కత్తిమీద సాములాంటిది. అందుకు అత్యంత కఠోరమైన శ్రమ కూడా తోడై ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. సివిల్ సర్వీసెస్‌ క్రాక్ చేయడం ఎంత కఠినమో ఆ పరీక్షను ఎదుర్కొన్న వారు ఎవరైనా చెప్పేమాట.. అయితే, పరీక్షలు అందరూ రాస్తారు.. కానీ, అందులో కొందరు మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. మరికొందరు టాప్ ర్యాంకర్లుగా నిలుస్తారు. అలాంటి అణిముత్యాల్లో కొందరు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి చివరికి తమ గమ్యాన్ని చేరుకుంటారు.


యూపీఎస్సీ అంటే అంత ఈజీ కాదు :
యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించడం ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత ఎదుర్కొనే ఇంటర్వ్యూ రౌండ్ అత్యంత క్లిష్టమైనది. ఈ ఇంటర్వ్యూను క్రాక్ చేయడం ఆశామాషీ వ్యవహారం కాదనే చెప్పాలి. అయినప్పటికీ, ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరి రౌండ్ వరకు వచ్చేసి చేతులేత్తేసినోళ్లు లేకపోలేదు. కానీ, యూపీఎస్సీ హిస్టరీలో సాధ్యం కానిది అంటూ ఏది ఉండదని నిరూపించినవాళ్లు ఉన్నారు. గత దశాబ్ద కాలంగా యూపీఎస్సీ పరీక్షల ఇంటర్వ్యూ రౌండ్‌లో అత్యధిక మార్కులు సాధించినవారిలో చాలామందే ఉన్నారు. అందులో చివరిగా ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ టైటిల్ ఎవరిదో మీకు తెలుసా? వారిలో ఎవరంటే?.. సాధారణంగా టీనా దాబీ, సృష్టి దేశ్‌ముఖ్, కనిష్క కటారియా, శుభం కుమార్ లేదా శ్రుతి శర్మ వంటి వారి పేర్లు విని ఉంటారు.

అత్యధిక మార్కులతో 107వ ర్యాంకు :
అలాంటి వారి తర్వాత ఐఏఎస్ అధికారిని జైనాబ్ సయీద్ ఆ రికార్డును అందుకున్నారని సంగతి మీకు తెలుసా? గత ఎనిమిదేళ్లుగా యూపీఎస్సీ ఇంటర్వ్యూ రౌండ్‌లో అత్యధిక మార్కులు సాధించిన రికార్డు ఈమెదే. 2014లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో జైనాబ్ సయీద్ ఉత్తీర్ణత సాధించింది. మెయిన్స్ పరీక్షలో 731 మార్కులతో ఇంటర్వ్యూ రౌండ్‌లో 275 మార్కులకు 220 మార్కులు సాధించింది. ఫలితంగా ఆమె మొత్తం 107వ ర్యాంక్‌ను సంపాదించి ఈ ఘనతను దక్కించుకుంది. దాంతో, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష చరిత్రలోనే అత్యధిక ఇంటర్వ్యూ స్కోర్ సాధించిన అభ్యర్థిగా జైనాబ్ సయ్యద్ నిలిచింది.

ఐఏఎస్ కావాలి అనేది డ్రీమ్ :
జైనాబ్ సయీద్ స్వస్థలం కోల్‌కతా. సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తదనంతరం, ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్‌లో 2011లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది. ఆమెకు ఐఏఎస్ కావాలనేది డ్రీమ్.. అందుకే, పోస్ట్-గ్రాడ్యుయేషన్ తరువాత జైనాబ్ యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రీపేర్ కావాలని నిర్ణయించుకుంది. సివిల్స్ అనేది ముళ్లబాట ప్రయాణం అని తెలిసినప్పటికీ కూడా ఆమె భయపడలేదు. ధైర్యంతో ముందుకు అడుగువేసింది.

IAS Officer Zainab Sayeed

చివరికి టాప్ ర్యాంకర్‌గా :
ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. మొదటి రెండు ప్రయత్నాలలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రిలిమినరీ పరీక్షలను కూడా క్లియర్ చేయలేకపోయింది. అయినా తన పట్టుదలను వీడలేదు. ఆమెలో గెలవాలనే కసి ఇంకా పెరిగింది. అదే అంకితాభావంతో బాగా ప్రీపేర్ అయి చివరకు మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటినీ క్లియర్ చేయడమే కాకుండా ఇంటర్వ్యూ రౌండ్‌లో జైనాబ్ టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచి ఐఏఎస్ కలను సాకారం చేసుకుంది.

25 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూ :
జైనాబ్ ప్రకారం.. తన ఇంటర్వ్యూ సుమారు 25 నిమిషాల పాటు కొనసాగింది. కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ వ్యవహారాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, యూరోపియన్ యూనియన్‌పై చర్చలతో సహా విభిన్న అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నలు పడ్డాయి. కొంచెం కూడా టెన్షన్ పడకుండా అడిగిన అన్నింటికి తనదైన శైలిలో తెలివిగా సమాధానాలు చెబుతూ ఇంటర్వ్యూను క్రాక్ చేసింది. యూపీఎస్సీ పరీక్షల్లో వరుసగా 2012, 2013లో నిరాశే ఎదురైంది. అదే పట్టుదలతో చివరకు 2014లో విజయాన్ని అందుకుంది.